తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆలయాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి స్వాగతించారు. తమిళనాడులోని హిందూ ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని..
కేవలం ఆలయాల అభివృద్ధి కోసం కేటాయించేలా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. విజయ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. హిందూ ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని ఇతర అవసరాల కోసం మళ్లించూకడదని.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని.. తెలుగు రాష్ట్రాలలో అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ దేవాదాయశాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయాలకు సంబంధించి ఆస్తులు, భూములు, ఆదాయాలపై ఆడిట్ చేయడంతో పాటుగా డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు మళ్లించకుండా ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలు, అర్చకుల సంక్షేమానికి మాత్రమే వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాలకు వచ్చిన నిధులతో నిర్మించాలనుకున్న కమర్షియల్ కాంప్లెక్స్‌లు, కళ్యాణ మండపాలు వంటి ప్రాజెక్టుల్ని కూడా రద్దు చేశారు. ఈ విషయాన్ని శ్రీనివాసానంద సర్వతి ప్రస్తావించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొందరు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని శ్రీనివాసానంద ఆరోపించారు. హిందువులపై లాయర్ జడ శ్రవణ్ కుమార్, ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్‌లు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ హిందవులకు వ్యతిరేకంగా ఉన్నవారికి న్యాయసాయం చేస్తుందని.. ఈ కుట్ర వెనుక ఆ పార్టీ కూడా ఉందన్నారు. ప్రకాష్ రాజ్ హిందూ పేరు పెట్టుకుని సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడటం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ దేవుళ్లను కించపరిచే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన తప్పుల్ని చెబితే తమను టార్గెట్ చేశారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను కొందరు ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారని ఆరోపించారు హిందూ సంఘాల నేత తురగా శ్రీరామ్. రాష్ట్రంలో రిజర్వేషన్లను లాక్కునే ప్రయత్నం జరుగుతోందని.. వీరి వెనుక కొంతమంది రాజకీయ నేతలు ఉన్నారని వ్యాఖ్యానించారు. కొంతమంది హిందుత్వాన్ని టార్గెట్ చేసి.. యూట్యూబర్, జర్నలిస్టుల ముసుగులో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్న రావణ్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు.

