Dailyhunt
తమిళనాడులో 'విజయ్' ప్రభంజనం.. కుప్పకూలిన సన్ టీవీ షేర్లు.. అసలు లింక్ ఏంటి?

తమిళనాడులో 'విజయ్' ప్రభంజనం.. కుప్పకూలిన సన్ టీవీ షేర్లు.. అసలు లింక్ ఏంటి?

Telugu Samayam 6 days ago

Sun TV: సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు ఈరోజు భారీగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్‌లో ఈ సంస్థ షేర్లు దాదాపు 10 శాతం మేర పడిపోయాయి.

దీంతో బీఎస్ఈలో ఇంట్రాడే కనిష్ఠ స్థాయి రూ.547.55ను తాకింది. ఈరోజు సన్ టీవీ నెట్‌వర్క్ (Sun TV Network) షేర్లపై తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ సినీ హీరో సీ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ మెజారిటీ సీట్లలో ముందంజలో దూసుకెళ్తోంది. కౌంటింగ్ ట్రెండ్స్‌లో టీవీకే అనూహ్యంగా ఆధిక్యంలోకి దూసుకుపోతుండడంతో, దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన ప్రస్తుత అధికార పార్టీ ద్రావిడ మున్నెట్ర కళగం (DMK) పట్టు కోల్పోతోంది. దీంతో ఆ పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉండే సన్‌టీవీ నెట్‌వర్క్ షేర్లపై తీవ్ర ప్రభావం పడింది.

సన్‌ టీవీ అనేది సన్ గ్రూప్ (Sun Group)లో ఒ కభాగం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మనవడు, ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్ మేనల్లుడు అయిన కళానిధి మారన్ నియంత్రణలో ఉంది. డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సన్ టీవీకి రాజకీయంగా మద్దతు ఉండి వ్యాపార అవకాశాలు మెరుగవుతాయని ఇన్వెస్టర్లు భావించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారితే ఆ అవకాశాలు తారుమారవుతాయనే భయం మార్కెట్ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

తమిళనాడులో గత మూడు దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే అధికారం మారుతూ వచ్చేది. అయితే, విజయ్ రాకతో సమీకరణాలు మారిపోయాయి. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపడం, డీఎంకే ఓటు బ్యాంకుకు భారీ గండి కొట్టింది. అధికార మార్పిడి జరిగితే సన్ టీవీకి ఉండే గుత్తాధిపత్యం తగ్గి, మీడియా రంగంలో కొత్త పోటీ లేదా నిబంధనలు వస్తాయన్న విశ్లేషణలతో అమ్మకాల ఒత్తడి పెరిగింది. 'రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్న మీడియా సంస్థలకు ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ అత్యంత కీలకం. డీఎంకే ఓటమి దిశగా సాగుతుండడంతో సన్ టీవీ భవిష్యత్తు ఆదాయాలపై ఇన్వెస్టర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు పూర్తిగా వెలువడే వరకు ఈ అనిశ్చితి కొనసాగవచ్చు' అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో సన్ టీవీ నెట్‌వర్క్స్ షేరు ఎన్ఎస్ఈలో 6.13 శాతం నష్టంతో రూ.568.50 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 548ని తాకింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.660.70 వద్ద ఉండగా, 52 వారాల కనిష్ఠ ధర రూ.480.20 వద్ద ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.22230 కోట్లుగా ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam