Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు

తెలంగాణ రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు

Telugu Samayam 3 weeks ago

తెలంగాణలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో.. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం (మే 4) సచివాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలతో పాటు కీలక అధికారులు పాల్గొన్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1.84 లక్షల మంది రైతుల నుండి సుమారు 14.40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో రూ. 2,001.96 కోట్లను ఇప్పటికే జమ చేశామని, చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కొనుగోళ్ల వేగాన్ని మరింత పెంచాలని, రైతులకు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కోనుగోళ్లు పూర్తయిన తర్వాత రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, సూర్యాపేట వంటి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయిన సంఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు.. రాబోయే మూడు నాలుగు రోజుల్లో వర్ష సూచన ఉన్నందున అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. రైతు పండించిన పంట కళ్లముందే వర్షార్పణం కాకూడదని.. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా టార్పాలిన్ కవర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. వర్షానికి తడిసిన ధాన్యం విషయంలో నిబంధనలు సడలించి, వాటిని వెంటనే పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి వెల్లడించారు. ఎన్నికల హామీలో భాగంగా రూ. 2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను దశలవారీగా అమలు చేస్తూ రైతులకు రుణ విముక్తి కలిగిస్తోందన్నారు. దీంతో పాటు, సాగు పెట్టుబడి కోసం ప్రతి ఎకరాకు ఆర్థిక సాయం అందించే పథకాలను మరింత పటిష్టం చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో దళారీల ప్రమేయం లేకుండా.. కనీస మద్దతు ధర నేరుగా రైతులకు అందేలా ప్రభుత్వం పారదర్శకమైన ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు.

ఇక రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి హరిచందనలతో చర్చించిన మంత్రి.. ధాన్యం తరలింపులో లారీల కొరత రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు అన్నదాతకు భరోసానిస్తాయని, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా కొనుగోళ్లు నిరంతరాయంగా సాగుతాయని మంత్రి భరోసా ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam