తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒక చార్జ్‌షీట్ విడుదల చేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావుతో కలిసి తెలంగాణ భవన్‌లో ఈ చార్జ్‌షీట్‌ను విడదుల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర సంపాదన కోసం మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు పీడ దినాలు పట్టి వెయ్యి రోజులు పూర్తయిందంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీపై చార్జ్‌షీట్ విడుదల చేశామని తెలిపారు. రైతులు ధాన్యం కుప్పల మీద చనిపోతున్నారని.. నీళ్లు అడిగితే తెలంగాణ సీఎం రక్తం పారిస్తున్నారన్నారు. ఈ వెయ్యి రోజుల్లో ఎంతో మంది రైతులు చనిపోయారని ఆయన గుర్తు చేశారు.
రైతు బీమాను కూడా తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందన్న కేటీఆర్, అన్నదాతల జేబులు కొట్టి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ జేబు నింపుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై కక్ష రైతులకు శిక్షగా మారిందన్న కేటీఆర్, ఈ అంశంపై ప్రశ్నించిన ఇంజినీర్లను బెల్టుతో కొడతానని బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు జాబులు అడిగితే లాఠీలతో కొడుతున్నారని.. ఉద్యోగాలు అడిగితే బావిలో దూకమంటున్నారంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి చెంచాగిరీ చేస్తున్నారని దుయ్యబట్టిన కేకేఆర్.. చదువురాని వ్యక్తి చేతుల్లో విద్యాశాఖ వెళ్లి.. విద్యా వ్యవస్థే భ్రష్టు పట్టిపోయిందని సీఎంపై నేరుగా విమర్శలు చేశారు. వైఎస్సార్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తమ హయాంలో కొనసాగించామని.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగిన కాలేజీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. పథకాలు లేవు కానీ మూసీ నదికి కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఈ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందంటూ కేటీఆర్ విమర్శలు చేశారు.

