Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో కొత్త ట్రిపుల్ ఐటీ క్యాంపస్.. ఈ జిల్లాలోనే, రూ.400 కోట్ల వ్యయంతో..

తెలంగాణలో కొత్త ట్రిపుల్ ఐటీ క్యాంపస్.. ఈ జిల్లాలోనే, రూ.400 కోట్ల వ్యయంతో..

Telugu Samayam 6 days ago

మ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను ఉన్నత విద్యా రంగంలో సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఈ మేరకు మహబూబ్‌నగర్, జడ్చర్ల సరిహద్దుల మధ్య కొత్తగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు.

ఈ మేరకు క్యాంపస్ మాస్టర్ ప్లాన్, సైట్ నమూనా సిద్ధమైంది. తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ అధునాతన హంగులతో రూపొందించిన ఈ లేఅవుట్ డిజైన్‌ను హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. సంస్థ ఎండీ మనపతిరెడ్డి నేతృత్వంలోని ఇంజనీరింగ్ బృందం క్యాంపస్ నిర్మాణ శైలి, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను డిజిటల్ నమూనా ద్వారా ఆయనకు వివరించారు.

ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా కీర్తికిరీటంలో ఈ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఒక గర్వకారణమైన మైలురాయిగా నిలవనుందని సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 40 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, పర్యావరణ హిత గ్రీన్ క్యాంపస్ విధానంలో దీనిని నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ క్యాంపస్ ద్వారా వెనుకబడిన పాలమూరు ప్రాంతంలోని గ్రామీణ విద్యార్థులకు జాతీయ స్థాయి నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఐటీ రంగంలో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా కోర్సులను ఇక్కడ ప్రవేశపెట్టడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మహబూబ్‌నగర్ నగరానికి ఐటీ హబ్‌గా సరికొత్త గుర్తింపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అధికారిక లేఅవుట్ ప్రకారం.. ఈ మెగా క్యాంపస్‌లో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల ప్రపంచస్థాయి వసతులను కల్పించనున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేటివ్ విభాగాల గదులు, ప్రొజెక్టర్ సదుపాయం గల స్మార్ట్ తరగతి గదులు, అధ్యాపకుల గదులు ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల వసతి కోసం బాలికలు, బాలురకు పూర్తి భద్రతతో కూడిన వేర్వేరు హాస్టల్ బ్లాకులు, అత్యాధునిక సెంట్రల్ కిచెన్, ఒకేసారి వందల మంది కూర్చునేలా డైనింగ్ హాళ్లు నిర్మిస్తారు. వీటితో పాటు నిత్యం అందుబాటులో ఉండేలా ఒక సూపర్ మార్కెట్, అత్యవసర వైద్య సేవల కోసం 24/7 హెల్త్‌కేర్ సెంటర్, కట్టుదిట్టమైన అంతర్గత భద్రత కోసం ప్రత్యేక సెక్యూరిటీ బ్లాకులను నమూనాలో పొందుపరిచారు.

ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్ ఐటీ సవాళ్లను తట్టుకునే విధంగా దశాబ్దాల కాలం పాటు ఉపయోగపడే మౌలిక వసతులను ఇక్కడ ప్లాన్ చేశారు. విద్యార్థుల మేధోవికాసం కోసం భారీ డిజిటల్ గ్రంథాలయం, అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు అనువైన ల్యాబొరేటరీలు, ఇన్డోర్ ఆడిటోరియం, సాంస్కృతిక ప్రదర్శనల కోసం ఓపెన్ థియేటర్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లను నిర్మిస్తున్నారు. క్యాంపస్‌లోనే ప్రొఫెసర్లు నివసించేలా క్వార్టర్స్, విదేశీ ప్రతినిధుల కోసం గెస్ట్ హౌస్, విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం క్రికెట్, ఫుట్‌బాల్ మైదానాలతో స్డేడియాలు రానున్నాయి. మొత్తం రూ.400 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన ఈ ప్రాజెక్టుకు గాను ప్రభుత్వం తొలి విడతలోనే రూ.200 కోట్లు మంజూరు చేసింది. ఈ బృహత్తర ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రతి ఏటా సుమారు 6 వేల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam