Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో పేదలకు శుభవార్త.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కీలక అప్డేట్

తెలంగాణలో పేదలకు శుభవార్త.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కీలక అప్డేట్

Telugu Samayam 2 weeks ago

తెలంగాణలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మే నెల చివరి నాటికి లబ్ధిదారుల్ని గుర్తించి కేటాయించాలని రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉన్నా సరే లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. అలాగే ముగింపు దశలో ఉన్న ఇళ్ల నిర్మాణ పనుల వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. పొంగులేటి మంత్రులు తుమ్మల, దామోదర రాజనర్సింహం, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి హౌసింగ్‌పై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి సాయం అందిస్తామన్నారు. ప్రస్తుతం పూర్తి చేసిన ఖర్చును మినహాయించి మిగతా డబ్బుల్ని ఇస్తామని తెలిపారు. ఒకవేళ కాంట్రాక్టర్లు ఇళ్లు పూర్తి చేయకపోతే లబ్ధిదారులు పూర్తి చేసుకోవాలని సూచించారు. వీరికి గ్రీన్‌ఛానల్‌ ద్వారా నిధులు విడుదల చేస్తామని తెలిపారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఎవరైనా అనర్హులు ఆక్రమిస్తే వెంటనే వారిని తప్పించి అర్హులకు కేటాయించాలని మంత్రి పొంగులేటి సూచించారు. అతాగే ఇళ్ల కేటాయింపు విషయంలో ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలన్నారు. రూ.400 కోట్లతో కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా బిల్లుల చెల్లింపుల విషయంలో అక్రమాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు, ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడంతో పాటుగా సర్వీస్ నుండి డిస్మిస్ చేసేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. కలెక్టర్లు అర్హులకు ఇళ్లను మంజూరు చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు దరఖాస్తు ఎప్పుడు చేశారో ముఖ్యం కాదని.. అర్హులకు ఇళ్లు అందించాలని సూచించారు మంత్రి.

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటి విడతలో వివిధ కారణాలతో నిర్మాణం చేపట్టని వారి బదులు కొత్తవారికి అవకాశం కల్పించాలని మంత్రి సూచించారు. అలాగే ప్రతి ఇందిరమ్మ ఇంటికి 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇసుక విషయంలో దుర్వినియోగం జరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కొంతమందికి నగరాలకు దూరంగా డబుల్ బెడ్‌రూమ్ కాలనీలను నిర్మించడం ఇబ్బందిగా మారిందన్నారు. చాలామంది లబ్ధిదారులు కేటాయించిన ఇళ్లలో ఉండటం లేదని.. అలాంటి వారిని గుర్తించి వారికి సమీపంలోనే ఇళ్లను కేటాయించాలని సూచించారు. అంతేకాదు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని మంత్రులు తేల్చి చెప్పారు. అలాగే కలెక్టర్లు ప్రభుత్వ భూముల ఆక్రమణలను కట్టడి చేయాలని సూచించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలి అన్నారు. రెండు శాఖలు కలిసి సర్వే నిర్వహిస్తే వివాదాలకు ఛాన్స్ ఉండదన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam