తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భూసారాన్ని కాపాడేందుకు భూసార ఆరోగ్య వాలంటీర్లు (సాయిల్ హెల్త్ వాలంటీర్లు)ను నియమించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 వేల మంది ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమిస్తామని.. ఇందులో భాగంగానే తొలి విడతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎంపికైన వాలంటీర్లకు ట్రైనింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్), తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ వాలంటీర్లకు శిక్షణ ఇస్తోంది.
ఈ నేపథ్యంలోనే సోమవారం ఇక్రిశాట్‌లో తొలి విడత సాయిల్ వాలంటీర్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. తెలంగాణలో రైతులు రసాయన ఎరువుల వినియోగం తగ్గించి.. సేంద్రియ ఎరువులను వాడటాన్ని పెంచాలని సూచించారు. భూమి రసాయనాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటేనే.. పండించిన పంటలో పౌష్టికాహారం ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు జీలుగ, పిల్లిపెసర సహా ఇతర పచ్చిరొట్ట విత్తనాల ద్వారా భూ సారాన్ని పెంచాలని హితవు పలికారు.
పంట కోసిన తర్వాత వాటి అవశేషాలను పొలాల్లోనే తగలబెట్టకుండా.. ఎరువులుగా ఉపయోగించాలని రైతులకు మంత్రి తుమ్మల తెలిపారు. భూసార ఆరోగ్య పరిరక్షణను ఒక ఉద్యమంలా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. ప్రతీ రెవెన్యూ గ్రామంలో ముగ్గురు వాలంటీర్ల చొప్పున కేటాయించనున్నట్లు వివరించారు. ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్లు.. తమ పరిధిలో ఉన్న రైతులకు భూసారం ఎలా కాపాడాలి.. పంటకు భూమిని ఎలా తయారు చేయాలి అనే దానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులను తీసుకువచ్చే నైపుణ్యాలను నేర్పిస్తారు.
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే రైతు ఉత్సవాల్లో అన్నదాతలు భారీగా పాల్గొనేలా చూడాలని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంతకుముందు ఇక్రిశాట్‌లోని వ్యవసాయ క్షేత్రాలను ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్.. వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ సహా పలువురు అధికారులతో కలిసి.. మంత్రి సందర్శించారు.

