తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నవారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త పింఛన్లను ఆగస్టు 15 నుంచి పంపిణీ చేయాలని సూచించారు.
సీఎం రేవంత్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై మంత్రి సీతక్కతో సమీక్షలో పాల్గొన్నారు. వెంటనే అర్హుల గుర్తింపు ప్రక్రియను చేపట్టాలని.. రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులు, తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా బాధిుతలకు పింఛన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఒకవేళ పింఛన్ తీసుకునే దివ్యాంగులు చనిపోతే.. వారి భార్యలకు వెంటనే పింఛన్ ఇవ్వాలన్నారు. తెలంగాణ మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరలు ఆకట్టుకునే డిజైన్లతో, నాణ్యంగా ఉండాలని సూచించారు సీఎం. నాణ్యత, రంగుల విషయంలో రాజీపడొద్దని.. డిజైన్ల కోసం ఎన్‌ఐఎఫ్‌టీ విద్యార్థుల సేవల్ని వినియోగించుకోవాలన్నారు.
రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం ఉందని.. పల్లెల్లో తాగు నీటి సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రతి నెలలో ఐదులోపు గ్రామీణ నీటిసరఫరా పథకాల పరిధిలో పని చేసే వారికి వేతనాలు ఇవ్వాలన్నారు. ఎంపీడీవోలు మండల స్థాయిలో జరిగే అభివృద్ధి పనుల్ని పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో ప్రతి 45 రోజులకు ఒకసారి మండల ప్రజా పరిషత్ సమావేశాలు నిర్వహించాలని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానించాలన్నారు. ఈ సమావేశాలు సర్పంచులు తమ గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఉపయోగపడతాయంటున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో తారు రోడ్లు ఉండాలని సూచించారు.. గ్రామాలకు జనాభా ఆధారంగా వర్గీకరించి పంచాయతీ భవనాలు నిర్మించాలన్నారు.
తెలంగాణలో ఆరుతడి పంటలు, కూరగాయల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్‌నినో ప్రభావంపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ సీఎంకు నివేదికను అందజేయగా.. రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌నినోపై ఇచ్చిన నివేదికలో అంశాలపై చర్చించేందుకు త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గాయని, భూగర్భ జలాలు పడిపోయాయన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినోతో ఏర్పడే సవాళ్లను ముందుగానే అంచనా వేసి ప్రణాళికను రూపొందించామన్నారు.

