Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీఎంసీలో 'సంతకాల' ప్రకంపనలు.. ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించిన మమతా బెనర్జీ

టీఎంసీలో 'సంతకాల' ప్రకంపనలు.. ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించిన మమతా బెనర్జీ

Telugu Samayam 3 weeks ago

శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత శ్రేణులను ఐక్యంగా ఉంచేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ నానా తంటాలు పడుతుండగా.. ఆ పార్టీలోని చీలికలు బట్టబయలయ్యాయి.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని కుదిపేసిన సంతకాల కుంభకోణంపై ముఖ్యమంత్రి సువేందు అధికారి చేసిన ప్రకటన టీఎంసీలో ప్రకంపనలు రేపుతోంది. అసెంబ్లీలో శోభన్‌దేబ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా ఆమోదిస్తూ రాసిన లేఖలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేసిన ఇద్దరు తృణమూల్ ఎమ్మెల్యేల పేర్లను సీఎం అధికారి వెల్లడించారు.

దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై మమతా బెనర్జీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు రీటాబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలను తృణమూల్ పార్టీ నుంచి బహిష్కరించి, వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. టీఎంసీ ప్రయోజనాలకు విరుద్దంగా కార్యక్రమాలు సాగించడం, ప్రకటనలు గుప్పించడంతో ఆ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకున్నామని, ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయని రెండు వేర్వేరు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ, వారు ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనేది మాత్రం స్పష్టం చేయలేదు.

తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చంద్రమా భట్టాచార్య సంతకం చేసిన ఒక లేఖలో.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పదేపదే పార్టీ సమావేశాలకు గైర్హాజరయ్యారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఆ లేఖ ప్రకారం ఎమ్మెల్యేలు పార్టీ ప్రయోజనాలకు హాని కలిగించే ప్రకటనలు కూడా చేశారు. ''ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ఏఐటీసీ నుంచి తక్షణమే బహిష్కరించాలని నిర్ణయించారు'' అని అందులో పేర్కొన్నారు. ఫోర్జరీ సంతకాలపై సీఎం సువేందు అధికారి ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే టీఎంసీ ఈ చర్యలకు దిగడం గమనార్హం.

''తృణమూల్ అవినీతి కేవలం ప్రజలనే కాదు.. సొంత ఎమ్మెల్యేలను కూడా లక్ష్యంగా చేసుకుంది. తన సొంత ఎమ్మెల్యేల సంతకాలను టీఎంసీ ఫోర్జరీ చేసింది. తృణమూల్ ఎమ్మెల్యేలు రీతబ్రత బెనర్జీ, సందీపన్ సాహా ఫిర్యాదు చేశారు. ఇందులో మాకు ఎలాంటి పాత్ర లేదు'' అని అధికారి విలేకరులతో అన్నారు.

సంతకాల ఫోర్జరీ ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో పలువురు తృణమూల్ నాయకులకు నోటీసులు జారీ చేసింది. తృణమూల్ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీని విచారణకు పిలిచినప్పటికీ, ఆయన సీఐడీ ముందు హాజరుకావడం లేదని తెలిసింది. ఎమ్మెల్యేల జాబితాపై సంతకం చేసింది పార్టీ ప్రధాన కార్యదర్శేనని పేర్కొంటూ, ఈ కేసులో అభిషేక్ బెనర్జీయే బాధ్యుడని సందీపన్ సాహా ఆరోపించారు.

''హాజరుకాని వారి సంతకాలను సమర్పించడం ఒక పెద్ద పొరపాటు. అభిషేక్ బెనర్జీ ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెల్యేల జాబితాపై సంతకం చేయడం వల్లే ఆయన పేరు ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఆ జాబితాలోనే ఎన్నో తప్పులు ఉన్నాయి... అది ఆయన బాధ్యత, దాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారు కాబట్టి అభిషేక్ బెనర్జీపైనే కచ్చితంగా ప్రశ్నలు తలెత్తుతాయి'' అని సాహా ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.

ఇదిలా ఉండగా, మమతా బెనర్జీ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి హాజరుకాని 60 మంది ఎమ్మెల్యేలలో సందీపన్ సహా, రితబ్రత బెనర్జీ ఉన్నారు. సీపీఎం నుంచి 2017లో టీఎంసీలోకి వచ్చిన రితబ్రత.. ఇటీవల ఎన్నికల్లో ఉలుబేరియా పూర్బ నుంచి గెలిచారు. బీజేపీ అభ్యర్థి రుద్ర ప్రసాద్ బెనర్జీని 11,800 ఓట్ల తేడాతో ఓడించారు. కాగా, ఎంటాలీ నుంచి సందీపన్ సహా బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై 34,000 ఆధిక్యంతో గెలుపొందారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam