తిరుమల శ్రీవారిని దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలను అందిస్తోంది. ప్రతి రోజూ లక్షలమంది అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు భక్తుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి.
గత రెండేళ్లలో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు భారీగా పెరిగాయి. 2023-2024లో విరాళాలు రూ.1,853 ఉంటే.. 2024-2025లో రూ.2,126 కోట్లకు చేరగా.. 2025-2026లో విరాళాలు రూ.2,553 కోట్లకు చేరాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో అన్నప్రసాదం పథకం ప్రారంభించి 41 ఏళ్లు అయిన సందర్భంగా ట్వీట్ చేశారు. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి రూ 2,500 కోట్లు దాటిందని తెలియజేశారు. టీటీడీ భక్తుల నుంచి వచ్చిన విరాళాలను బ్యాంకుల్లో ఉంచుతుంది.. ప్రతి రోజూ అన్నప్రసాదానికి అవసరమైన డబ్బుల్ని మాత్రం ఖర్చు చేస్తారు.
తిరుమల శ్రీవారి టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. భక్తులు ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు చెల్లించొచ్చు. ఈ రూ.44 లక్షల్లో.. ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు కేటాయిస్తారు. మిగిలిన వాటిలో మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు వెచ్చిస్తారు. ఈ రూ.44 లక్షలు విరాళం అందజేసిన దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించే అవకాశం కల్పించింది టీటీడీ. తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలో విరాళం అందించే దాత పేరును ప్రదర్శిస్తారు. తిరుమలలో మాత్రమే కాదు తిరుపతి, ఒంటిమిట్ట రామాలయంలో కూడా అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. త్వరలోనే మరికొన్ని ఆలయాల్లో కూడా అన్నప్రసాద వితరణను ప్రారంభించాలని టీటీడీ భావిస్తోంది.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ భక్తులకు అన్నప్రసాదాలను అందించింది. ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా 1.25 లక్షల పైచిలుకు భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేసినట్లు టీటీడీ తెలిపింది. శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని తిలకించేందుకు ఒంటిమిట్టకు తరలివచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయ సమీపంలోని అన్నప్రసాద వితరణ కేంద్రంతో పాటు కల్యాణ వేదిక వద్ద ఉద్యోగుల సౌకర్యార్థం కేంద్రాన్ని ఏర్పాటు చేసి సమర్థవంతంగా పంపిణీ చేశారు.
కల్యాణోత్సవం రోజున భక్తులకు పులిహోర, రవ్వ కేసరి, మైసూర్ పాక్, కారాలు, బిస్కెట్ ప్యాకెట్, అరటిపండు, వాటర్ బాటిల్, టెట్రా ప్యాకెట్, మజ్జిగలను ఒకే బ్యాగ్‌లో అందజేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ భక్తులకు ఉదయం పొంగలి, ఉప్మా, సాంబర్, చట్నీ, మధ్యాహ్నం, రాత్రి సమయాలలో అన్నం, చెక్కెర పొంగలి, కూర, చట్నీ, సాంబర్, రసం, మజ్జిగలను వడ్డించారు. మార్చి 27 నుండి ఏప్రిల్ 5 వరకు రోజువారీగా వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. మార్చి 27న 30వేల 700, 28న 22వేల 900, 29న 23వేల 900, 30న 22వేల 300, 31న 26వేల 500, ఏప్రిల్ 1న అన్నప్రసాదాలు 40 వేలమందికి, కల్యాణోత్సవం సందర్భంగా గ్యాలరీలలో 85 వేల మందికి.. ఏప్రిల్ 2న 23వేల 500, 3న 18వేల 450, 4న 15వేల 350, 5న 11వేల 400 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారని టీటీడీ తెలిపింది. మొత్తం 10 రోజుల్లో దాదాపు 3.20 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

