తిరుమలలో రద్దీ పెరిగింది.. వేసవి సెలవులతో పాటుగా వారాంతం కావడంతో భక్తులు స్వామిదర్శనానికి భారీగా తరలివచ్చారు. ఈ ణెల 2న రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ, మంచినీరు వంటి సేవలను టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలు కూడా ఎలాంటి లోటు లేకుండా భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సేవలను మరింత మెరుగుపరుస్తున్నారు.
తిరుమలలో వేసవి రద్దీ పెరగడంతో టీటీడీ ఇంజినీరింగ్ విభాగం రూ.2 కోట్లతో పనులు చేపట్టింది. కొండపైకి వచ్చే భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగేలా ఏర్పాట్లు చేశారు. బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2తో పాటుగా మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు ఏర్పాటు చేశారు.. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. భక్తుల కాళ్లు కాలకుండా చల్లగా ఉండేలా కూల్ పెయింటింగ్ వేశారు. అవసరమైన చోట్ల అదనపు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. తిరుమలలో భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగించే శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్ల దగ్గర చలువ పందిళ్ల ఏర్పాటు చేశారు.
తిరుమలలో రద్దీ, ఎండల తీవ్రతను గమనించి టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో కొన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 16 చోట్ల వైద్య కేంద్రాలు ఉన్నాయి.. భక్తులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, నారాయణగిరి దగ్గర మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. తిరుమలలో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్ములతో తాగునీరు అందిస్తున్నారు. శ్రీవారి సేవకులు భక్తుల దగ్గరకు వెళ్లి తాగు నీరు అందిస్తున్నారు. ఒక బ్యాచ్‌లో 15 మంది శ్రీవారి సేవకులు ఉన్నారు.. ఇలా మొత్తం మూడు బ్యాచుల్లో రోజుకు 45 మంది భక్తులకు తాగునీరు పంపిణీ చేస్తున్నారు. పారిశుద్ధ్య పనులు వేగవంతం చేశారు.. ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు.
టీటీడీ వేసవిలో భక్తుల రద్దీని గమనించి అదనంగా మరో 3.50 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా అందుబాటులో ఉంచారు. తిరుమలలో మొత్తం 7500 గదులు, ఐదు యాత్రికుల వసతి సముదాయాలు ఉన్నాయి.. 60వేలమందికి మాత్రమే వసతి కేటాయించడానికి వీలుంటుంది. కాబట్టి గదులు పొందలేని భక్తులు తిరుమలలోని పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ (పద్మనాభ నిలయం), పీఏసీ-5 లలో ఉన్న దాదాపు తొమ్మిదివేల లాకర్లను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. తిరుమలలో ఒంటరిగా వచ్చే భక్తులకు వసతి గదులు కేటాయించరు. తిరుమలలో భక్తులు స్వామివారికి తలనీలాల సమర్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. తిరుమలలో వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకుఅవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందించడంపై టీటీడీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
తిరుమలలో రద్దీని గమనించి స్వామివారి దర్శనానికి తమ వంతు వచ్చేవరకు సంయమనంతో వేచి ఉండాలని టీటీడీ భక్తులకు సూచించింది. అలాగే భక్తుల రద్దీ గురించి అసత్య కథనాలు ప్రసారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వేసవి సెలవులకు తోడు వారాంతం కూడా రావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారన్నారు. శ్రీవారి సేవకుల ద్వారా సర్వ దర్శన క్యూలైన్లలోని భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

