Dailyhunt
టీవీకే చేతిలో స్టాలిన్ ఓటమి.. 'డీఎంకే పగ్గాలు చేపట్టబోయేది మీరేనా'?.. ఉదయనిధి ఏం చెప్పారంటే?

టీవీకే చేతిలో స్టాలిన్ ఓటమి.. 'డీఎంకే పగ్గాలు చేపట్టబోయేది మీరేనా'?.. ఉదయనిధి ఏం చెప్పారంటే?

Telugu Samayam 5 days ago

MK Stalin Defeat Kolathur 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. దశాబ్దాల కాలంగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఘోర పరాజయం పాలైంది.

అన్నిటికంటే పెద్ద షాక్ ఏమిటంటే.. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజక వర్గమైన కొలత్తూరులో ఓడిపోవడం. గత 35 ఏళ్ల రాజకీయ జీవితంలో స్టాలిన్ ఎదుర్కొన్న తొలి ఎన్నికల ఓటమి ఇదే కాగా.. ఈయన ఓటమితో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరుంటానే దానిపై చర్చ నడుస్తోంది. ముఖ్యంగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఉండొచ్చనే వార్తలు వినిపిస్తుండగా.. నేరుగా ఆయనే దీనిపై స్పందించారు. ఆపూర్తి వివరాలు మీకోసం.

తండ్రి ఓటమి.. కొడుకు గెలుపు..!

ఓవైపు స్టాలిన్ తన కంచుకోట కొలత్తూరులో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో ఓడిపోగా.. మరోవైపు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం చేపాక్ తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి 7,000 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసెంబ్లీలో లేకపోవడంతో.. డీఎంకే పగ్గాలను ఉదయనిధి చేపట్టాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రతిపక్ష నాయకుడు మీరేనా అంటే.. ఉదయనిధి ఏమన్నారంటే?

ఎన్నికల ఫలితాల అనంతరం ఉదయనిధి స్టాలిన్ ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగానే ప్రతిపక్ష నేత పదవి గురించి అడగ్గా.. ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. "ఆ నిర్ణయం నేను తీసుకోలేను. మా పార్టీలో గెలిచిన ఎంతోమంది సీనియర్ నేతలు, అనుభవజ్ఞులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. మా నాయకుడు (స్టాలిన్) ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధం" అని స్పష్టం చేశారు. అలాగే పార్టీని నడిపించడానికి యువ నాయకత్వం ముందుకు రావాలా? అన్న ప్రశ్నకు "ఖచ్చితంగా.. అదొక మంచి మార్పు అవుతుంది" అని సమాధానం ఇచ్చారు.

నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తొలి ఎన్నికల్లోనే అద్భుత ప్రదర్శన కనబరిచింది. 108 స్థానాలను కైవసం చేసుకుని తమిళనాడులోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో 59 ఏళ్ల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి బ్రేక్ పడింది. దీనిపై స్పందిస్తూనే.. ప్రజల తీర్పును తాము గౌరవిస్తామని, గెలిచిన వారితో కలిసి ప్రజల కోసం పని చేస్తామని ఉదయనిధి పేర్కొన్నారు. 2019లో డీఎంకే యువజన విభాగం సెక్రటరీగా ప్రస్థానం మొదలుపెట్టి.. 2024లో ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఉదయనిధి.. ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పార్టీని అసెంబ్లీలో నడిపిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam