Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Toxic Collections Day 1: డివైడ్ టాక్‌తోనూ 'టాక్సిక్' ఊచకోత.. యష్ మూవీకి ఫస్ట్ డే భారీ కలెక్షన్స్..

Toxic Collections Day 1: డివైడ్ టాక్‌తోనూ 'టాక్సిక్' ఊచకోత.. యష్ మూవీకి ఫస్ట్ డే భారీ కలెక్షన్స్..

Telugu Samayam 1 week ago

న్నడ హీరో యశ్ నటించిన 'టాక్సిక్' మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చేసింది. ఎప్పుడో సమ్మర్ లో రిలీజ్ కావలసిన ఈ సినిమా.. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి డివైడ్ టాక్ నడిచింది. రివ్యూలు కూడా ఆశించిన విధంగా రాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుంది?, బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంటుందా లేదా? తెలుగులో పరిస్థితి ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది.

'టాక్సిక్' సినిమాని KVN ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె.నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మించారు. 'KGF 2' తర్వాత యశ్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో, భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. దాదాపు రూ.108 కోట్లకు తెలుగు రైట్స్ తీసుకున్నట్లు టాక్. కర్ణాటక సుమారు రూ.100 కోట్లు, తమిళం రూ.50 కోట్లు, ఓవర్ సీస్ రూ.75 కోట్లు, హిందీతో సహా మిగతా రెస్టాఫ్ ఇండియా రూ.100 కోట్లకు అమ్మినట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఓవరాల్ గా రూ.450 కోట్ల భారీ టార్గెట్ తో 'టాక్సిక్' బరిలో దిగినట్టుగా వెల్లడించాయి.

'టాక్సిక్' సినిమాకి ఉన్న హైప్ తో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ప్రీసేల్స్ లో 'ధురంధర్ 2' పేరిట ఉన్న రికార్డు కూడా బ్రేక్ అయింది. 'ధురంధర్‌ 2' సినిమాకి ప్రీసేల్‌లో 14 లక్షల టికెట్లు అమ్ముడవ్వగా, ఇప్పుడు 'టాక్సిక్‌' మూవీకి 16 లక్షల టికెట్స్ సేల్ అయ్యాయి. ఫలితంగా అన్ని భాషల్లో కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే సుమారుగా రూ.85 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు అలవోకగా రూ.100 - 120 కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించవచ్చని అంచనా వేస్తున్నాయి. ('టాక్సిక్' మూవీ రివ్యూ)

తెలుగు రాష్ట్రాల్లో 'టాక్సిక్' మూవీకి టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో టికెట్‌పై అదనంగా జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్స్‌లలో, రూ.100 వరకు పెంచుకునేందుకు అనుమతిచ్చారు. తెలంగాణలో జీఎస్టీతో కలిపి సింగిల్‌ స్క్రీన్‌లో టికెట్‌ ధర రూ.227గా, మల్టీప్లెక్స్‌లలో రూ.395గా ఉంది. ఏపీలో బుధవారం( ఆగస్టు 26) ఉదయం 6 గంటల స్పెషల్‌ ప్రీమియర్‌ షో టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించారు. ఈ టికెట్ రేట్లు ఇప్పుడు తెలుగులో 'టాక్సిక్' మూవీ ఓపెనింగ్ డే భారీ వసూళ్లు రాబట్టడానికి హెల్ప్ అయ్యాయి.

తెలుగులో 'టాక్సిక్' మూవీని అత్యధిక షోలలో ప్రదర్శించారు. దానికి తగ్గట్టుగానే ఓ రేంజ్ లో ప్రీ బుకింగ్స్ జరిగాయి. టాక్ తేడా కొట్టినప్పటికీ, ఓపెనింగ్స్ కి మాత్రం డోకా లేకుండా పోయింది. ఫస్ట్ డే తెలుగు నుంచి రూ.12-14 కోట్ల వరకూ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ డివైడ్ టాక్ వచ్చింది కాబట్టి, రెండో రోజు నుంచి బారీగా డ్రాప్స్ ఉంటాయి. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం కష్టమే అనే మాట వినిపిస్తోంది. దీంతో దిల్ రాజుకు భారీ నష్టాలు తప్పవని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అయితే 'టాక్సిక్' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మారినా దిల్ రాజుకి వచ్చిన నష్టం ఏమీ ఉండదనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి కారణం దిల్ రాజు ఈ సినిమా హక్కులను 'రిటర్నబుల్ అడ్వాన్స్' కండిషన్ మీద తీసుకున్నారట. అంటే దీని ప్రకారం ఒకవేళ బాక్సాఫీస్ టార్గెట్ ను రీచ్ కాలేకపోతే, ఎంత నష్టం వచ్చినా నిర్మాత ఆ మొత్తాన్ని తిరిగి దిల్ రాజుకి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే నిజమైతే మాత్రం, 'టాక్సిక్' సినిమా విషయంలో ఆయనకు పోయేది ఏమీ లేదనే అనుకోవాలి. చూద్దాం.. రాబోయే రోజుల్లో ఈ సినిమా తెలుగులో ఎలాంటి నంబర్స్ రాబడుతుందో.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam