KGF స్టార్ యశ్ హీరోగా నటించిన 'టాక్సిక్' మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
ఆశించిన స్థాయిలో లేదని రివ్యూలు తేల్చేశాయి. రిలీజుకు ముందుకు హైప్ కారణంగా ఓ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. దీంతో భారీ ఓపెనింగ్స్ రావడం గ్యారంటీ. కానీ ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ తో పోలిస్తే, 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద బిగ్ ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో దిల్ రాజుకు భారీ నష్టాలు తప్పవని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
'టాక్సిక్' మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ఎలాంటి డౌట్ లేకుండా, నిర్మాత కోట్ చేసిన ధరకు రైట్స్ తీసుకున్నారు. ఇది రూ.2000 కోట్ల కలెక్షన్లు రాబట్టే సత్తా ఉన్న చిత్రమని మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా చెప్పారని ప్రీరిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వెల్లడించారు. అదే కాన్ఫిడెన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియటర్లలో రిలీజ్ చేశారు. కానీ తొలి రోజే టాక్ తేడా కొట్టింది. ప్రీమియర్ షోల నుంచే నెగెటివ్ టాక్ బయటకు వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమే అనే కామెంట్స్ వస్తున్నాయి.
'టాక్సిక్' కారణంగా రవితేజ 'ఇరుముడి' సినిమాకి బుధవారం సగానికి సగం స్క్రీన్లు తగ్గిపోయాయి. మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతోన్న తెలుగు సినిమాని తీసేసి, ఆ థియేటర్లను కన్నడ డబ్బింగ్ మూవీకి కేటాయించారంటూ సోషల్ మీడియాలో చర్చ నడిచింది. దిల్ రాజుపై ఓ వర్గం నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'ఇరుముడి' సినిమాని తీసి, టాక్సిక్ మూవీ వేయడంపై కొన్ని ఏరియాల్లో థియేటర్ల ముందు ధర్నాలు కూడా చేశారు. నిన్న ఫస్ట్ డే టాక్సిక్ టాక్ చూసిన తర్వాత, దిల్ రాజుపై మళ్లీ ట్రోలింగ్ షురూ చేశారు. ఈ దెబ్బతో దిల్ రాజు పని అయిపోయిదని, భారీ నష్టాలు తప్పవని పోస్టులు పెడుతున్నారు. దాదాపు రూ.100 కోట్ల నష్టం అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వారికి తెలియని విషయం ఏంటంటే.. ఈ సినిమాతో దిల్ రాజు నష్టపోయేది ఏమీ లేదు.
'టాక్సిక్' మూవీ తెలుగు హక్కులను దిల్ రాజు 'రిటర్నబుల్ అడ్వాన్స్' బేసిస్ మీద తీసుకున్నారు. దీని ప్రకారం ఒకవేళ బాక్సాఫీస్ టార్గెట్ ను రీచ్ కాలేకపోతే, ఎంత నష్టం వచ్చినా నిర్మాతలు ఆ మొత్తాన్ని తిరిగి దిల్ రాజుకి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో ఈ మూవీకి రూ.108 కోట్ల భారీ డీల్ కుదిరింది కానీ, ఆ తర్వాత సినిమా విడుదల వాయిదా పడటంతో దాన్ని రూ.80 కోట్లకు సవరించారట. చివరికి బయ్యర్లు రూ.75 కోట్లు మాత్రమే పంపించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రిటర్నబుల్ అడ్వాన్స్ కండిషన్ మీద 'టాక్సిక్' సినిమా ద్వారా నష్టపోతే, ఆ నష్టాన్ని 45 రోజుల్లో తిరిగి వెనక్కి ఇచ్చేలా నిర్మాతలతో దిల్ రాజు అగ్రిమెంట్ చేసుకున్నారట. ఆల్రెడీ దిల్ రాజు బ్యానర్ లో యష్ ఓ సినిమా చేస్తానని మాటిచ్చారు. ఒకవేళ 'టాక్సిక్' సినిమాకి నష్టమొచ్చి, ఆ లోటును భర్తీ చేయడంలో ఏదైనా సమస్య వచ్చినా.. అదే దిల్ రాజుతో యష్ చేయబోయే సినిమాకి అడ్వాన్స్‌గా మారుతుంది. ఎందుకంటే 'టాక్సిక్' మూవీలో హీరో యష్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ('టాక్సిక్' మూవీ రివ్యూ)
మరోపక్క KVN ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణ ప్రస్తుతం చిరంజీవితో 'కాకా' సినిమా చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజయ్యే ఈ మూవీ నైజాం హక్కులను దిల్ రాజుకు ఇస్తానని కేవీఎన్ సూత్రప్రాయంగా హామీ ఇచ్చారట. అంటే సంక్రాంతి సీజన్‌లో ఒక క్రేజీ సినిమా హక్కులు ఆయనకు దక్కినట్టే. ఇలా ఎటు చూసుకున్నా దిల్ రాజుకు లాభమే తప్ప, నష్టమేమీ లేదు. ఆయన మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల బయ్యర్లు కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్టే. కాబట్టి 'టాక్సిక్' సినిమాతో నిర్మాతలకు ఏమైనా సమస్య ఉండొచ్చు కానీ, దిల్ రాజుకు అన్ని విధాలుగా లాభమే. ఒక రకంగా ఫలితంతో సంబంధం లేకుండా 'టాక్సిక్' సినిమాకి నిజమైన లబ్ధిదారుడు దిల్ రాజే అనుకోవాలి.

