తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, సినీ నటి త్రిషను ఉద్దేశించి.. డీఎంకే అగ్రనేత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు.. ఆ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఇవాళ పోలీసులు.. ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేయడం పెను సంచలనంగా మారింది. భారీ ఎత్తున బందోబస్తుతో ఉదయనిధి స్టాలిన్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేశారు. అయితే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్‌పై డీఎంకే శ్రేణులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్‌కు నిరసనగా.. డీఎంకే కార్యకర్తలు, నేతలు.. తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. దీంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఈ కేసులో మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో అత్యవసర విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. తక్షణమే ఉదయనిధి స్టాలిన్‌ను విడుదల చేయాలని తంజావూరు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కోర్టుకు చెప్పిన పోలీసులు.. అతడిని విచారణ చేసిన తర్వాత విడుదల చేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణకు సహకరించాలని ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టు సూచించింది.
కావేరీ జలాల సమస్యపై తంజావూరులో డీఎంకే పార్టీ నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉదయనిధి స్టాలిన్.. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆ సభలో ఉన్న కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరుతో నినాదాలు చేయగా.. డబుల్ మీనింగ్ వచ్చేలా ఉదయనిధి స్టాలిన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారని టీవీకే పార్టీ వర్గాలు తీవ్ర ఆరోపణలు చేశాయి.
ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని.. టీవీకే మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు, మహిళా వేధింపుల నిరోధక చట్టం, ఐటీ చట్టం కింద ఉదయనిధి స్టాలిన్‌పై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద అరెస్ట్ చేసి తంజావూరుకు తరలించారు.

