ఉగ్రవాదంపై పోరాటంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని, ఆర్థిక సహకారం, రిక్రూట్‌మెంట్, రాడికలైజేషన్, సురక్షిత స్థావరాలు సహా దాని మొత్తం వ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పిలుపునిచ్చారు.
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్‌కేక్ వేదికగా జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. 'మానవాళి మొత్తానికి ఉగ్రవాదం తీవ్రమైన సవాల్' అని అభివర్ణించారు. దీనిపై పోరాటం కేవలం 'చర్య-ప్రతిచర్య' ఆలోచనకే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు సదస్సుకు హాజరైన పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌కు మోదీ చురకలంటించారు.
''ఉగ్రవాదానికి సంబంధించి ఫైనాన్సింగ్, రిక్రూట్‌మెంట్, రాడికలైజేషన్, సురక్షిత స్థావరాలు సహా మొత్తం నెట్‌వర్క్‌ను మనం నిర్మూలించాలి. ఈ తీవ్రమైన అంశంపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని మనం ఒకే గొంతుతో స్పష్టం చేయాలి' అని ఆయన అన్నారు. ''ఉగ్రవాదాన్ని తమ విధానంగా మార్చుకుని వారికి ఆశ్రయం, మద్దతు ఇస్తున్న దేశాలకు... ఉగ్రవాదం ఎప్పటికీ ఎవరికీ 'హామీ ఇచ్చే వ్యూహాత్మక ఆస్తి' కాజాలదని గట్టి సందేశం పంపాలి'' అని ప్రధాని స్పష్టం చేశారు.
షాంఘై సహకార కార్పొరేషన్ కోసం భారత విజన్ వెల్లడించిన ఆయన.. ''భద్రత, అనుసంధానత, అవకాశాలు'' అనే మూడు ముఖ్యమైన స్తంభాలని వివరించారు. వీటిలో శాంతి- భద్రత మొదటి స్తంభంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ''ప్రశాంతమైన, సురక్షితమైన యురేషియా కోసం మన ఉమ్మడి కార్యాచరణ.. అఫ్గనిస్థాన్‌లో శాంతి, స్థిరత్వంతో ముడిపడి ఉంది'' అని నొక్కిచెప్పిన మోదీ.. అఫ్గన్ ప్రజలకు భారత్ తన అభివృద్ధి, మానవతా సహాయాన్ని కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు.
పశ్చిమాసియా సంక్షోభంపై మాట్లాడుతూ.. ఒక ప్రాంతంలో ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా 'ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా గొలుసులపై' దెబ్బతీస్తాయని మోదీ అన్నారు. ''దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలే అత్యధికంగా నష్టపోతున్నాయి.. అందుకే అన్ని రకాల ఉద్రిక్తతలు, యుద్ధాలకు పరిష్కారం యుద్దభూమిలో సాధ్యం కాదని, కేవలం 'చర్చలు, దౌత్యం' ద్వారానే సాధ్యమని భారత్ పదే పదే నొక్కి చెబుతుంది'' అని అన్నారు.
మరోవైపు... డ్రగ్స్ అక్రమ రవాణా యువతకు, ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించిందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా బెదిరింపులు, వ్యవస్థీకృత నేరాలు, సమాచార భద్రత, నార్కోటిక్స్ వ్యవహారాలను పర్యవేక్షించే ఎస్‌సిఓ యంత్రాంగాల ద్వారా మరింత బలమైన సహకారం అందించాలని కోరారు. ''సకాలంలో చర్యలు చేపట్టడానికి, ఆచరణాత్మక సమన్వయానికి ఇవి సమర్థవంతమైన మాధ్యమాలుగా మారాలి'' అని మోదీ పిలుపునిచ్చారు.
ఎస్‌సిఓ సహకారం ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించాలని, భవిష్యత్ కార్యాచరణలో 'ప్రజల మధ్య సంబంధాల'ను కేంద్ర బిందువుగా ఉంచాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ''మన ప్రయత్నాలు యువతకు ఎన్ని కొత్త అవకాశాలను సృష్టించాయి.. మన పారిశ్రామికవేత్తలకు ఎన్ని కొత్త మార్కెట్లను తెరిచాయి.. సాంకేతికత ద్వారా మన రైతులకు ఎంత లబ్ధి చేకూరింది.. మన పౌరుల జీవితాలు ఎంతగా మెరుగపడ్డాయి అనేదే మన విజయాన్ని కొలిచే నిజమైన కొలమానం'' అని వ్యాఖ్యానించారు.
ఈ శిఖరాగ్ర సదస్సుకు కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ అధ్యక్షత వహించి, ఆతిథ్యం ఇచ్చారు. ప్రధాని మోదీతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసూర్ పెజెష్కియాన్, ఇతర ఎస్‌సిఓ సభ్యదేశాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

