ఏపీలో కొద్దిరోజులుగా దాసరి రాముతో పాటుగా కొంతమంది కాపు సంఘాలకు చెందిన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కాపు సంఘాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ముద్రగడ పద్మనాభ రెడ్డి కుమార్తె, జనసేన పార్టీ నేత క్రాంతి కౌంటరిచ్చారు. పవన్ కళ్యాణ్ చొరవతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన నాటి నుంచి చూస్తున్నానని.. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండేళ్లు కూడా పూర్తికాకుండానే కాపుల్లో ఎమోషన్ రెచ్చగొట్టడానికి కొంతమంది నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఈ సోకాల్డ్ కాపు నాయకుల వల్ల కాపు కులం ఎంత నష్టపోయిందో అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
మిగతా కులాల్లో కట్టుబాటు ఉంటుంది కానీ.. కాపుల్లో అది లేదన్నారు బర్లపూడి క్రాంతి. ఆ కట్టుబాటు ఉంటే ఇన్ని సంఘాలు ఎందుకు.. ఇంతమంది కాపు నాయకులు ఎందుకో చెప్పాలన్నారు. ఇటీవల జనసేన పార్టీలో కాపులు లేకపోవడంతో.. పవన్ కళ్యాణ్ కాపుల సమస్యలు చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందంటూ కొందరు కాపు నేతలమని చెప్పుకునేవారు లేవనెత్తిన సమస్యగా అభివర్ణించారు. మరి అలా అనేవారిని తాను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నానని.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారంతా ఎక్కడ ఉన్నారని.. అప్పుడు వాళ్ల గొంతులు ఏమైపోయాయని ప్రశ్నించారు.
'మీరు కేవలం కాపు కులం గురించే మాట్లాడుతున్నందున కొన్ని విషయాలు గుర్తు చేయాల్సి వస్తోంది. ఈరోజు జనసేన పార్టీకి ఉన్న 21 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 10 మంది కాపులే ఉన్నారు. ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా అదే వర్గానికి చెందినవారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ నిర్ణయాల వల్ల ఎన్నో సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన కాపు యువకులు, నాయకులు కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పదవులను పొందారు. వేలాది మందికి రాజకీయంగా ఎదిగే అవకాశాలు లభించాయి. నిజానికి ఈ కాపు సంఘ నాయకుల వల్ల కాపులు ఎంత నష్టపోయారో కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా లేకపోతెే ఇంకా నష్టపోతాం అని గుర్తిస్తే చాలు' అన్నారు క్రాంతి.
'ఈ పోరాటాలు చేస్తున్నట్లు కనిపిస్తారు.. ఎప్పుడు ఆపేస్తారో, ఎలా ఆపుతారో కూడా తెలియదు. కాపుల్లో ఐక్యత లేదని నిరూపించేసి పక్కకు తప్పుకుంటారు. ఎవరు చూసినా ఇదే తంతు.. ఇంకా ఎన్నాళ్లీ మోసం, దగా ఈ వాస్తవాలను సగటు కాపులు గ్రహించి విషయాలను అర్ధం చేసుకోవాలని బాధ్యతతో చెబుతున్నాను. దయచేసి ఎవరి మౌత్ పీస్ గానో మారకండి. కలతలు సృష్టించవద్దని సో కాల్డ్ కాపు నాయకులను హెచ్చరిస్తున్నాను' అంటూ క్రాంతి ఓ వీడియోను ట్వీట్ చేశారు.

