Dailyhunt
వావ్.. ఎంత చక్కగా చెప్పారు సార్.. ఆర్టీఏ అధికారిపై ప్రశంసలు.. వీడియో వైరల్, లోకేష్ ట్వీట్

వావ్.. ఎంత చక్కగా చెప్పారు సార్.. ఆర్టీఏ అధికారిపై ప్రశంసలు.. వీడియో వైరల్, లోకేష్ ట్వీట్

Telugu Samayam 4 days ago

టీవల కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలులో గతేడాది జరిగిన ఘటన, ఇటీవల మార్కాపురం బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపాయి.

ఈ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో ఆర్టీఏ (రవాణాశాఖ) అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేపట్టారు. అలాగే బస్సుల్లో ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రవాణాశాఖ అధికారి ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో మంత్రి లోకేష్ స్పందించి.. ఆ అధికారిని అభినందించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ సిద్దిఖ్‌ ప్రయాణికులతో మాట్లాడిన సమయంలో వీడియో తీయడంతో వైరల్ అయ్యింది.

ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే.. ఆ సమయంలో విలువైన వస్తువులు ఉన్నాయని బస్సులో ఉండిపోకుండా బయటకు వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలని ఆర్టీఏ అధికారి సూచించారు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన ఓ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. మార్కాపురం బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఎగ్జిట్ డోర్ దగ్గర ముగ్గురు ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. 'ఆ ముగ్గురు మేం ముందు వెళ్లాలి, మేం ముందు వెళ్లాలి అనుకున్నారు.. కానీ ముగ్గురు అక్కడ ఇరుక్కుపోయారు.. ఒకరి తర్వాత మరొకరు వెళ్లుంటే ముగ్గురు బతికేవారు.. వారి వెనుక మరో ఇద్దరు ఎఫెక్ట్ అయ్యుంటారు' అని తొందరపాటులో ముగ్గురి ప్రాణాలు పోయాయని వివరించారు.



ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కంగారుపడొద్దు, ధైర్యంగా ఉంటే జాగ్రత్తగా బయటపడొచ్చని ప్రయాణికులకు సూచించారు రవాణాశాఖ అధికారి. తాను రోజూ వచ్చి అందరికి ఇలా జాగ్రత్తలు చెప్పలేనని.. ఒకవేళ మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసినవాళ్లు ఎవరైనా బస్సుల్లో ప్రయాణిస్తుంటే.. బస్సు ఎక్కగానే ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో చూసుకోమని వారితో చెప్పాలన్నారు. ప్రమాదం జరిగి పొగ వస్తే ముక్కుకు ఏదైనా కట్టుకుని కిందకు దిగాలని.. విలువైన వస్తువుల కోసం బస్సులోనే ఉండి టైం వేస్ట్ చేసుకోవద్దని సూచించారు. తమ వైపు నుంచి బస్సుల్ని తనిఖీలు చేస్తున్నామని.. ప్రయాణికులు కూడా జాగ్రతలు తీసుకోవాలని కోరారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను మంత్రి లోకేష్ కూడా షేర్ చేశారు. ఇటీవలి బస్సు ప్రమాద ఘటనలతో ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పించడానికి ప్రయాణికులకు జాగ్రత్తలు చెబుతూ.. రవాణాశాఖ అధికారి తీసుకున్న చొరవపై ప్రశంసలు కురిపించారు.. ఇలా అవగాహన కల్పిస్తే ఎంతోమంది ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు నిలబడతాయన్నారు. ఈ చిన్న మెసేజ్ ఎన్నో ప్రమాదాలను నివారించగలదన్నారు. ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను పాటించాలని, ఈ వీడియోను స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయాలని మంత్రి లోకేష్ కోరారు. ప్రతి ఒక్కరి బస్సు ప్రయాణం సురక్షితంగా ఉండాలని కోరుకుందామన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam