Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరంగల్ MGM ఆస్పత్రిలో ప్రమాదం.. స్లాబ్ పెచ్చులు కూలి ముగ్గురికి గాయాలు

వరంగల్ MGM ఆస్పత్రిలో ప్రమాదం.. స్లాబ్ పెచ్చులు కూలి ముగ్గురికి గాయాలు

Telugu Samayam 4 hrs ago

త్తర తెలంగాణలో కీలక ప్రభుత్వ ఆస్పత్రిగా ఉన్న వరంగల్‌ మహాత్మా గాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) ఆసుపత్రిలో ప్రమాదం జరిగింది. ఎంజీఎం ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో ఆదివారం ఉదయం స్లాబ్‌ పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడి కిందపడటంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

ఈ ఘటనతో వార్డులో ఉన్న రోగులు, వారి సహాయకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పైకప్పు పెచ్చులు ఊడి కిందపడిన ఘటనలో పక్షవాతంతో చికిత్స పొందుతున్న మస్తాన్‌ (55), అటెండర్లు ఎల్లమ్మ (50), ఓంకార్‌ (33) గాయపడ్డారు.

ఈ ముగ్గురు జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం ఉప్పుగల్‌ గ్రామానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. పైకప్పు పెచ్చులు పడటంతో వారికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి.. అక్కడ ట్రీట్‌మెంట్ అందించారు. గాయపడిన ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆరోగ్యశ్రీ వార్డులో రోగులు చికిత్స పొందుతున్న సమయంలోనే పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

దీంతో ఆ వార్డులో బెడ్లపై ఉన్న రోగులతో పాటు వారిని చూసేందుకు వచ్చినవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై గాయపడిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. పైకప్పు పెచ్చులు ఊడి పడిన వార్డును తాత్కాలికంగా మూసివేసి.. వాటి శిథిలాలను తొలగించారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌కుమార్‌ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వార్డులోని మిగతా రోగులను మరో వార్డుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఆ బిల్డింగ్ పాతది కావడం, పైకప్పు నుంచి నీరు లీకేజీ కావడం వల్ల స్లాబ్‌ పెచ్చులు ఊడిపోయి కిందపడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటనతో ఆసుపత్రి భవనాల నిర్వహణ, భద్రతా చర్యలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల ప్రజలకు ప్రధాన ప్రభుత్వ వైద్య కేంద్రంగా ఉంది. వరంగల్‌తో పాటు జనగామ, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ వంటి ప్రాంతాల నుంచి నిత్యం భారీ ఎత్తున రోగులు ఎంజీఎం ఆస్పత్రికి రకరకాల చికిత్సల కోసం వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రి భవనాల భద్రతపై ప్రత్యేక దృష్టి అవసరమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలోనూ ఎంజీఎం ఆస్పత్రిలో బిల్డింగ్, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలు తెరపైకి వచ్చిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. పాత బిల్డింగ్‌లలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయా.. ఎక్కడైనా పైకప్పులు, స్లాబ్‌లు లీక్ అవుతున్నాయా.. అనే అంశాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

ఇదిలా ఉండగా.. వరంగల్ నగరంలో కొత్త మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తున్న సమయంలో ప్రస్తుత ఎంజీఎం భవనాల భద్రతపై కూడా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయా లు వెల్లువెత్తుతున్నాయి. చికిత్స కోసం వచ్చే రోగులకు వైద్య సేవలతో పాటు సురక్షితమైన వాతావరణం కల్పించడం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam