'RX 100' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి.. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 'మహా సముద్రం', 'మంగళవారం' చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
తీసింది తక్కువ సినిమాలే అయినా, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు లేటెస్టుగా 'శ్రీనివాస మంగాపురం' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఆయన సినిమాలతోనే కాదు, తన మాటలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అజయ్ భూపతి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
'శ్రీనివాస మంగాపురం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అజయ్ భూపతి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'సినిమా' అంటే ఓనమాలు కూడా తెలియని వాడు కూడా ఇప్పుడు రివ్యూలు ఇస్తున్నారని అన్నారు. తన కెరీర్ లో ఇప్పటి వరకూ ఒక్క షాట్ కూడా రీషూట్ చేయలేదని తెలిపారు. తన మీదకు ఎవరైనా వచ్చి మాట్లాడితే G పగలకొట్టేస్తానన్నారు. కోనసీమ వాళ్లకి బూతులు అలంకారాలు అని పేర్కొన్నారు.
'శ్రీనివాస మంగాపురం' సినిమా షూటింగ్ చాలా భాగం తిరుపతిలో జరిగింది. అక్కడే షూట్ చేసినా ఒక్కసారి కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోలేదని అజయ్ భూపతి చెప్పారు. గత పదేళ్లుగా స్వామివారి మీద అలిగి ఉన్నానని, అందుకే స్వామిని దర్శించుకోలేదని తెలిపారు. అందుకు వ్యక్తిగత కారణాలు ఉన్నాయన్నారు. అజయ్ భూపతి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

