తెలంగాణలోని విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యుత్ ఉద్యోగుల కరువు భత్యాన్ని (DA) 1.621 శాతం మేర పెంచుతూ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు.
విద్యుత్ సౌధలోని జెన్కో ప్రధాన కార్యాలయంలో ఇంధన శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పెంపుదల అమల్లోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యుత్ ఉద్యోగుల డీఏ ప్రస్తుతమున్న 17.651 శాతం నుంచి 19.272 శాతానికి చేరుకుంది.
70 వేల మందికి పైగా సిబ్బందికి ప్రయోజనం
ఈ డీఏ పెంపుదల నిర్ణయం వల్ల తెలంగాణ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న, పదవీ విరమణ పొందిన మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. కాగా.. ఈ అదనపు అలవెన్స్ పెంపుదల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెలా సుమారుగా రూ. 9.35 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడనుందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటూనే.. సంస్థల ఆర్థిక స్థితిగతులను సమన్వయం చేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఏ పెంపుతో పాటు విద్యుత్ రంగ సంస్థల ప్రస్తుత పనితీరు, ఆర్థిక పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల కారణంగా ఎక్కడైనా స్తంభాలు విరిగిపడినా లేదా ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా.. సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కంట్రోల్ రూమ్‌లను అప్రమత్తం చేసి లోపాలను వీలైనంత త్వరగా సరిదిద్ది పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. వర్షాకాలంలో తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ముందస్తు ప్రణాళికలతో పాటు అవసరమైన అదనపు సామగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పారిశ్రామిక, గృహ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న పదేళ్లను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ రంగ సంస్థల్లో మౌలిక సదుపాయాలను పటిష్ఠం చేయాలని డెప్యూటీ సీఎం సూచించారు. రాష్ట్రంలో 2035-36 ఆర్థిక సంవత్సరం నాటికి పీక్ డిమాండ్ దాదాపు 34,137 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ ఏడాది నమోదైన గరిష్ట పీక్ డిమాండ్ 18,548 మెగావాట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు ఉంటుందన్నారు. ఈ భారీ డిమాండ్‌ను అందుకోవడానికి వీలుగా ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను ఆధునీకరించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

