Dailyhunt
Vignesh Shivan: 'ధనుష్ స్నేహాన్ని కోల్పోయినందుకు సిగ్గు పడుతున్నా'.. నయనతార భర్త కీలక వ్యాఖ్యలు

Vignesh Shivan: 'ధనుష్ స్నేహాన్ని కోల్పోయినందుకు సిగ్గు పడుతున్నా'.. నయనతార భర్త కీలక వ్యాఖ్యలు

Telugu Samayam 1 week ago

కోలీవుడ్ హీరో ధనుష్‌ - నయనతార, విఘ్నేష్ శివన్ దంపతుల మధ్య కొన్నాళ్లుగా ఓ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పర్మిషన్ తీసుకోకుండా నయన్ డాక్యుమెంటరీలో తన సినిమాలోని ఫుటేజీ ఉపయోగించారంటూ ధనుష్ అప్పట్లో వారిపై కోర్టులో కేసు వేశారు.

అది ఎక్కడిదాకా వచ్చిందో తెలియదు కానీ.. ఇప్పుడు ధనుష్‌ ను ఉద్దేశించి విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనలో తన తండ్రిని చూసుకున్నానని అన్నారు.

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. నయనతార నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విఘ్నేష్.. ధనుష్ గురించి మాట్లాడారు. ''ధనుష్‌ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని ఎప్పుడూ గొప్పగానే చూస్తాను. జులై 28 ఆయన బర్త్ డే. అది మా మా నాన్న చనిపోయిన రోజు. దాని వల్ల ధనుష్ లో నేను నా తండ్రిని చూసుకున్నట్లు ఫీల్ అవుతాను. ఆయన మీద అంత ప్రేమ ఉంది'' అని దర్శకుడు అన్నారు.

''ఎందుకు ఇలా జరిగిందో.. అసలు ఏం జరిగిందో మాకు తెలియదు. ఏం జరిగిందో అర్థంకానటువంటి భిన్నమైన పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. అదే నాకు అతిపెద్ద నష్టం అని అనుకుంటున్నాను. ఆయనతో మంచి రిలేషన్ షిప్ ఉండేది. అది కోల్పోయినందుకు నాకు సిగ్గుగా ఉంది. ఏదో జరిగింది.. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను ఇప్పుడు ఈస్థాయిలో ఉన్నానంటే, ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నానంటే దానికి 100 శాతం ధనుష్ సార్ కారణం. 'VIP' సినిమా సమయంలో రెండేళ్లపాటు నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన తిన్నాకే తినేవాడిని. ఒకప్పుడు మా మధ్య అంతటి అనుబంధం ఉండేది. ఆయనతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అలాంటి ఒక బంధాన్ని కోల్పోవడం రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నా''

''దురదృష్టవశాత్తూ, ఆ స్నేహం ఇప్పుడు లేదు. అందుకు నేనెంతో సిగ్గుపడుతున్నా. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. కానీ సమస్యే లేకుండా ఇద్దరం విడిపోయాం. నేను దాన్ని ఎలా పరిష్కరించగలను?. అసలు సమస్య ఉంటేనే కదా, ఎలా సాల్వ్ చేయాలో తెలియడానికి. ధనుష్ సార్ అత్యంత కష్టపడి పనిచేసే వ్యక్తి. ఆయన్ని చూస్తే భయమేస్తుంది. ఉదయం నాలుగు గంటల నుంచి అర్థరాత్రి వరకూ నిర్విరామంగా పనిచేస్తాడు. ఆయన పేస్ అంతా ఎర్రబడేది. 'నన్ను ఉదయాన్నే ఆరున్నర గంటలకు నిద్ర లేపురా' అని చెప్పేవాడు. ఉదయాన్నే ఆరు గంటలకే లేచి మమ్మల్ని నిద్రలేపేవాడు. ప్రతిరోజూ ఇలానే జరిగేది. అసలు ఆయన ఎలా చేస్తారో ఏమో'' అని విగ్నేష్ శివన్ అన్నారు.

ధనుష్ ఫోన్ నంబర్ ని తాను 'D మిడాస్ స్టార్' అని సేవ్ చేసున్నానని విఘ్నేష్ తెలిపారు. తమ మధ్య ఇదంతా ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కానీ.. తనకు ధనుష్ పై ఎప్పటికీ అదే ప్రేమ, గౌరవం ఉంటాయన్నారు. చివరి శ్వాస వరకూ ఆయనపై రెస్పెక్ట్ అలానే ఉంటుందని నయనతార భర్త పేర్కొన్నారు.

ధనుష్‌తో నయనతార వివాదం ఏంటంటే..

నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నానుమ్‌ రౌడీ దాన్‌'. తెలుగులో 'నేనూ రౌడీనే' అనే పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్ని ధనుష్‌ తన సొంత బ్యానర్ పై నిర్మించారు. సినిమా షూటింగ్‌లోనే నయన్‌ - విఘ్నేశ్‌ ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లు డేటింగ్ చేశాక పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ, పెళ్లి నేపథ్యంలో 'నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. అందులో 'నానుమ్‌ రౌడీ దాన్‌' సీన్స్ ఉపయోగించారు. దీనిపై ధనుష్‌ టీమ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.

అనుమతి లేకుండా విజువల్స్ ఉపయోగించడంపై ధనుష్‌ కోర్టులో దావా వేశారు. దీనిపై నయనతార ఓపెన్ లెటర్ రిలీజ్‌ చేశారు. డాక్యుమెంటరీ ట్రైలర్‌లో 3 సెకన్ల బీటీఎస్ విజువల్స్ వాడినందుకు పరిహారంగా ధనుష్‌ రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారని తెలిపారు. ధనుష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో విఘ్నేష్ శివన్‌ సైతం ధనుష్‌ తీరును తప్పుబడుతూ ఇన్‌స్టాలో పోస్టులు పెట్టి డిలీట్‌ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు ధనుష్ అంటే తనకు ఎంతో ఇష్టమని, చనిపోయే వరకూ ఆయనపై లవ్, రెస్పెక్ట్ ఉంటాయని విఘ్నేశ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam