వియత్నాంతో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఒప్పందం ఇప్పటికే కుదిరిందని, ఇండోనేషియాతో ఒప్పందం తుది దశలో ఉందని సింగపూర్‌లో పర్యటిస్తోన్న భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ శనివారం కీలక ప్రకటన చేశారు.
షాంగ్రిలా డైలాగ్ ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వియత్నాం ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సింగ్ స్పందిస్తూ.. ''నాకున్న అవగాహన ప్రకారం ఇండోనేషియా, వియత్నాం రెండింటితోనూ ఒప్పందాలు చివరి దశకు చేరుకున్నాయి. వాస్తవానికి వియత్నాంతో ఒప్పందం ఇప్పటికే పూర్తయింది. బహుశా దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించకపోవచ్చు.. కానీ సంతకాలు మాత్రం జరిగిపోయాయి'' అని అన్నారు. శిక్షణ, లాజిస్టికల్ మద్దతుతో కలిపి వియత్నాంతో జరిగిన ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 6,000 కోట్లు ($629 మిలియన్లు) ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్‌సోనిక్ క్షిపణిని కొనుగోలు చేసిన మొదటి దేశం ఫిలిప్పీన్స్ అన్న ఆయన.. ఆసియాన్ కూటమి పట్ల భారత్‌కు బలమైన నిబద్ధత ఉందని స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను 2024లో.. రెండో బ్యాచ్‌ను 2025 ఏప్రిల్‌లో అందజేశారు. అధునాతన క్షిపణి సాంకేతికతలను పంచుకునే విస్తృతమైన అంశాన్ని ప్రస్తావిస్తూ... ఆసియాన్ కూటమితో భారతదేశానికి బలమైన అనుబంధం ఉందని సింగ్ వివరించా. ''మేము మీ అందరినీ 'స్నేహపూర్వక దేశాలు'గా భావిస్తాం.. మీతో మా అధునాతన రక్షణ సాంకేతికతలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం'' అని ఆయన అన్నారు.
సాధారణంగా తమకు నమ్మకమైన, స్నేహపూర్వక భాగస్వాములుగా భావించే దేశాలకే అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, ప్లాట్‌ఫారమ్‌లను భారత్ విక్రయిస్తుందని అని తెలిపారు. 'సహజంగానే మనం నమ్మిన వారితోనే సాంకేతికతను పంచుకుంటాం' అని సింగ్ వ్యాఖ్యానించారు. ప్రాంతీయంగా, అంతకు మించి ఉన్న దేశాలతో కలిసి పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణానికి, నమ్మకమైన రక్షణ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి, సురక్షితమైన సముద్ర మార్గాలను, ఇన్నోవేషన్ సహకారాన్ని పెంపొందించడానికి భారత్ సిద్ధంగా ఉందని షాంగ్రిల్లా డైలాగ్‌లో సింగ్ స్పష్టం చేశారు. 'ఈ రోజుల్లో వ్యూహాత్మకంగా పటిష్టంగా ఉండటం అనేది అత్యంత ముఖ్యమైన అవసరంగా మారింది'' అని ఆయన అన్నారు.
ఈ నెల ప్రారంభంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హనోయి పర్యటనలో వియత్నాం మంత్రి ఫాన్ వాన్ గియాంగ్‌తో ఇరు దేశాల మధ్య విస్తరిస్తున్న రక్షణ భాగస్వామ్యంపై సుదీర్ఘ చర్చలు జరిపారు. డీఆర్డీఓ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేష్ కుమార్ సింగ్... సింగపూర్‌లో ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, నెదర్లాండ్స్ దేశాల ఉన్నతాధికారులతో విడివిడిగా చర్చలు జరిపారు. ఇండో-పసిఫిక్, ఐరోపా భాగస్వామ్య దేశాలతో భారత్ తన రక్షణ దౌత్యాన్ని మరింత వేగవంతం చేస్తోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

