ముఖ్యంగా శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాను.. భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాటలతో కవ్వించాడు. మైండ్ గేమ్‌తో బోల్తా కొట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో డిక్వెల్లా 80 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించాడు. కుదురుగా బ్యాటింగ్ చేశాడు. సరిగ్గా ఇదే సమయంలో జైస్వాల్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో డిక్వెల్లా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జైస్వాల్.. షార్ట్ లెగ్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అప్పుడే అతడు బ్యాటర్ దగ్గరకు వచ్చి కవ్వించే ప్రయత్నం చేశాడు.
"కమాన్ యార్.. మొదటి ఇన్నింగ్స్‌లో చాలా షాట్లు ఆడావు కదా, ఇప్పుడు కూడా ఏదో ఒకటి చూపెట్టు" అని జైస్వాల్ అన్నాడు. దానికి డిక్వెల్లా సమాధానమిస్తూ "ఏంటి?" అని అడగగా, జైస్వాల్ వెంటనే స్క్వేర్ లెగ్ వైపు చూపిస్తూ "అటువైపు ఒక పెద్ద షాట్ కొట్టి చూపించు, ఎందుకు కొట్టవు?" అని సవాల్ విసిరాడు. జైస్వాల్ మాటలకు డిక్వెల్లా స్పందిస్తూ, "ఇప్పుడు అవసరం లేదులే.. నన్ను ఐపీఎల్‌లోకి తీసుకెళ్లు, అప్పుడు కొడతాను" అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.
డిక్వెల్లా ఐపీఎల్ ప్రస్తావన తేగానే జైస్వాల్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. "కచ్చితంగా తీసుకెళ్తాం, 100% తీసుకెళ్తాం! నువ్వు ఇప్పుడు ఒక సిక్స్ కొట్టు, నిన్ను ఐపీఎల్‌లోకి తీసుకెళ్లే బాధ్యత నాది" అంటూ డిక్వెల్లాను షాట్ ఆడేలా ప్రేరేపించాడు. దానికి డిక్వెల్లా "థాంక్యూ" అని చెబుతూ నవ్వేశాడు. ఈ సంభాషణ అంతా స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డవ్వడంతో కామెంటేటర్లతో పాటు వీక్షకులు కూడా తెగ నవ్వుకున్నారు. జైస్వాల్ ప్లాన్ చేసినట్లే ఈ సంభాషణ తర్వాత డిక్వెల్లా ఏకాగ్రత దెబ్బతింది.
క్రేజీ విషయం ఏమిటంటే, ఈ సంభాషణ జరిగిన అదే ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో నిరోషన్ డిక్వెల్లా షాట్ ఆడబోయి తన వికెట్ సమర్పించుకున్నాడు. వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. జైస్వాల్ వేసిన మైండ్ గేమ్ వలకి డిక్వెల్లా చిక్కిపోయాడని, యంగ్ ప్లేయర్ అయినప్పటికీ జైస్వాల్ ఎంతో తెలివిగా ప్రవర్తించి టీమిండియాకు వికెట్ అందించాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

