Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువతకు ఉపాధి పండుగ.. 91 వేల మందికి రాజీవ్‌ యువవికాసం

యువతకు ఉపాధి పండుగ.. 91 వేల మందికి రాజీవ్‌ యువవికాసం

Telugu Samayam 2 weeks ago

రాష్ట్రంలోని గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ (ట్రైకార్‌) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

గిరిజనుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రూ.2,546.24 కోట్లతో రూపొందించిన ప్రతిష్టాత్మక వార్షిక రుణ ప్రణాళికకు ట్రైకార్ బోర్డు అధికారికంగా ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ట్రైకార్‌ బోర్డు ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఈ సదస్సులో ట్రైకార్‌ ఛైర్మన్‌ బెల్లయ్యనాయక్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఎం సంతోష్‌తో పాటు ఉన్నతాధికారులు లక్ష్మీప్రసాద్, శంకర్‌రావు తదితరులు పాల్గొని ప్రణాళికల అమలుపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ట్రైకార్‌ ఎండీ బీఎం సంతోష్ వార్షిక ప్రణాళికకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ భారీ బడ్జెట్ ప్రణాళిక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,36,184 మంది గిరిజన యువతీ యువకులకు నూతన ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం కేటాయించిన రూ.2,546.24 కోట్లలో సింహభాగం అంటే.. రూ.2,085 కోట్లను ప్రభుత్వం సబ్సిడీ రూపంలోనే భరిస్తుండటం విశేషం. మిగిలిన రూ.461.24 కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో లబ్ధిదారులకు ఇప్పించి పథకాలను విజయవంతంగా అమలు చేస్తామన్నారు. ఈ వార్షిక ప్రణాళికలో రాజీవ్‌ యువవికాసం, ఆదిమ గిరిజనులకు జీవనోపాధి, గ్రామీణ రవాణా పథకం, గిరిజన రైతులకు యాంత్రీకరణ పథకం, సీఎంఎస్టీఈఐ, ఇందిరా సౌరగిరి జలవికాసం, నైపుణ్య అభివృద్ధి శిక్షణ వంటి పటిష్ట కార్యక్రమాలను పొందుపరిచారు.

గిరిజన యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారిని స్వయం ఉపాధి వైపు నడిపించడానికి రాజీవ్‌ యువవికాసం పథకం కింద గరిష్టంగా రూ.1,225.79 కోట్లు కేటాయించారు. దీని ద్వారా రికార్డు స్థాయిలో 91,687 మందికి స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తారు. ఇందులో ప్రభుత్వ రాయితీ వాటా రూ.1,000 కోట్లు కాగా.. మిగిలిన రూ.225.79 కోట్లను బ్యాంకు రుణంగా సమకూరుస్తారు. అట్టడుగున ఉన్న గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.521.24 కోట్ల మొత్తం వ్యయంతో ఆదిమ గిరిజనుల జీవనోపాధి పథకాన్ని రూపకల్పన చేశారు. దీని ద్వారా 13,897 మందికి లబ్ధి చేకూరుతుంది. ఇందులో బ్యాంకు రుణం రూ.311.24 కోట్లు కాగా, ప్రభుత్వ సబ్సిడీ రూ.210 కోట్లుగా ఉంది.

క్యూర్‌ పరిధిలోని ప్రాంతాలలో రవాణా రంగాన్ని పర్యావరణహితంగా మార్చేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 7,500 మంది గిరిజన లబ్ధిదారులకు చెందిన పాత డీజిల్, పెట్రోల్ ఆటోలను వంద శాతం ఉచిత ప్రభుత్వ రాయితీతో బ్యాటరీ ఆధారిత విద్యుత్తు వాహనాలుగా మారుస్తారు. ఇందుకోసం ట్రైకార్ రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. గిరిజన యువతను ఉన్నత స్థాయి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి గిరిజన నవ పరిశ్రమల పథకం కింద రూ.200 కోట్లతో 100 భారీ యూనిట్లను మంజూరు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ సబ్సిడీ రూ.50 కోట్లు, బ్యాంకు రుణం రూ.130 కోట్లుగా ఉంటుంది. మిగిలిన రూ.20 కోట్లను లబ్ధిదారుల వాటాగా భరించాల్సి ఉంటుంది.

గిరిజన యువతకు ఆధునిక రంగాలలో ఉపాధి లభించేలా రూ.75 కోట్ల వ్యయంతో 13,000 మందికి ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తారు. అలాగే, వ్యవసాయాన్ని నమ్ముకున్న గిరిజన రైతుల కోసం రూ.600 కోట్ల భారీ అంచనాతో ఇందిరా సౌరగిరి జలవికాసం అమలు చేయనున్నారు. దీని ద్వారా 10 వేల మంది లబ్ధిదారుల పోడు భూములను సాగుయోగ్యంగా మార్చడంతో పాటు, ఉచితంగా సోలార్‌ బోరుబావులను ఏర్పాటు చేసి శాశ్వత నీటి వసతి కల్పిస్తారు. ఈ నిధులన్నీ సకాలంలో లబ్ధిదారులకు చేరేలా, ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తామని ట్రైకార్ బోర్డు స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam