Dailyhunt
ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త బాధ్యతలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త బాధ్యతలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

Telugu Samayam 4 months ago

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆహారశుద్ధి, ఫుడ్‌ బిజినెస్, ఆక్వా రంగాల్లో మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రొడక్ట్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పించాలని సూచించారు. సీఎం పట్టణ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా, సెర్ప్‌)లపై సమీక్ష చేశారు. డ్వాక్రా, స్వయం సహాయక సంఘాల సభ్యులకు గంటల్లోనే రుణాలు ఇస్తున్నామని బ్యాంకర్లు చెబుతున్నారని.. అధికారులు ఇది నిజంగా అమలవుతుందో లేదో పరిశీలించాలని సూచించారు. డ్వాక్రా మహిళలు బ్యాంకు రుణాలను మరింత బాగా ఉపయోగించుకోవడానికి అవసరమైతే ఫండ్ మేనేజర్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని కూడా పరిశీలించాలన్నారు.

మహిళల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులు, టెక్నాలజీ వంటి వాటిపై అవగాహన కల్పించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. మహిళా సంఘాల సభ్యుల ప్రస్తుత తలసరి ఆదాయం రూ.1.45 లక్షల నుంచి మరింత పెరగాలన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని.. ఇప్పుడు రూ.20,739 కోట్లు పొదుపు చేస్తున్నారన్నారు చంద్రబాబు. బ్యాంకు రుణాలను రెండింతలు తీసుకుని 90% మందికి పైగా తిరిగి చెల్లిస్తున్నారని.. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు.

అలాగే డ్వాక్రా మహిళలతో స్టార్‌బక్స్ తరహాలో అరకు కాఫీ, మిల్లెట్ల అవుట్‌లెట్లను ఏర్పాటు చేసి.. వాటి బాధ్యతల్ని అప్పగించాలని
సూచించారు. అలాగే మహారాష్ట్రలో అమలవుతున్న బ్యాంబూ మిషన్ పాలసీని కూడా అధ్యయనం చేయాలని సూచనలు చేశారు. డ్వాక్రా మహిళల్ని ఎంఎస్‌ఎంఈలు స్థాపించేలా, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్లాన్ చేయాలన్నారు. గుర్రపు డెక్క, మునగాకుతో ఉత్పత్తులు తయారు చేయడం, ఎగ్, ఆక్వా, మిల్లెట్‌ కార్ట్‌ వంటి ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేపట్టాలన్నారు సీఎం. పర్యాటక రంగంలో హోంస్టేలను డ్వాక్రా సంఘాల ద్వారా ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్మా 'మన మిత్ర' యాప్‌ను, అవని వార్షిక సంచిక, ప్రజ్ఞా యాప్‌ను ఆవిష్కరించారు. ఈ మన మిత్ర యాప్‌లో మెప్మాకు సంబంధించిన 8 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. మంగళగిరికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు మాధురికి ఎస్‌బీఐ మంజూరు చేసిన రూ.1.25 కోట్ల రుణం చెక్కును అందజేసి అభినందించారు. ఈ రుణంపై 10% రాయితీ కూడా లభిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ఒక వ్యక్తికి రుణం మంజూరు కావడం ఇదే మొదటిసారి. ఈ రూ.1.25 కోట్లకు మరో రూ.కోటి కలిపి మొత్తం రూ.2.25 కోట్లతో నెయ్యి తయారీ యూనిట్‌ను యర్రబాలెంలో ఏర్పాటు చేయనున్నారు. మెప్మా (MEPMA) ద్వారా పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలు తయారుచేసే వస్తువులకు 'అవని' అనే బ్రాండ్‌తో మార్కెటింగ్ చేయాలని నిర్ణయించారు.
దీనివల్ల వారి ఉత్పత్తులకు మంచి గుర్తింపు వస్తుందంటున్నారు. ఏడాదిలో దాదాపు 60,000 మంది మహిళలకు స్వయం ఉపాధి పొందడానికి మెప్మా ద్వారా రుణాలు ఇప్పించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam