Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amarnath Yatra Shivling : అమర్‌నాథ్ యాత్రికులకు బ్యాడ్‌న్యూస్.. ఐదు రోజుల్లోనే మంచు శివలింగం అదృశ్యం..! కారణాలివే..

Amarnath Yatra Shivling : అమర్‌నాథ్ యాత్రికులకు బ్యాడ్‌న్యూస్.. ఐదు రోజుల్లోనే మంచు శివలింగం అదృశ్యం..! కారణాలివే..

10tv 2 weeks ago

Amarnath Yatra 2026 Shivling : అమర్‌నాథ్ యాత్రికులకు బ్యాడ్‌న్యూస్. యాత్ర ప్రారంభమైన కేవలం ఐదు రోజులకే పవిత్ర గుహలోని సహజసిద్ధ మంచు శివలింగం దాదాపు కరిగిపోయింది.

మే నెలలో ఈ మంచు లింగం సుమారు ఏడు అడుగుల ఎత్తున ఉంది. అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జులై 3వ తేదీ ప్రారంభమైంది. కాగా.. జులై 7వ తేదీ నాటికి మంచు శివలింగం దాదాపు కరిగిపోయింది. సాధారణంగా 57రోజులపాటుసాగే ఈ వార్షిక యాత్ర, సావన్ మాసపు పౌర్ణమి నాడు వచ్చే రక్షాబంధన్ రోజున ముగుస్తుంది. అయితే, ఈసారి కేవలం ఐదు రోజులకే మంచు శివలింగం కరిగిపోవడం భక్తులను నిరాశకు గురిచేస్తోంది.

అమర్‌నాథ్‌లో మంచు శివలింగం అదృశ్యం కావడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రాంతీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉష్ణగాలులు, శీతాకాలంలో తగ్గిన మంచు కురిసే శాతమే ఇందుకు ప్రధాన కారణాలని పర్యావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీ వల్ల గుహలో ఉత్పన్నమవుతున్న మానవ ఉష్ణోగ్రతలు, కాలుష్యం కూడా సహజసిద్ధ మంచు శివలింగం కరగడానికి కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే అమర్‌నాథ్ శివలింగాన్ని 1.5 లక్షల మందిదర్శించుకున్నారు. రోజుకు భారీ సంఖ్యలో భక్తులు గుహను సందర్శిస్తుండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని నివేదికల ప్రకారం.. మే 23న అమర్‌నాథ్ మంచు శివలింగం ఎత్తు ఏడు అడుగులు ఉండగా.. జూన్ 29 నాటికి అది ఐదు అడుగులకు తగ్గింది. ఇక జులై 7వ తేదీ నాటికి తాజా చిత్రాలు ఆ మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయినట్లు వెల్లడిస్తున్నాయి. అయితే, మంచు శివలింగం వేగంగా కరిగిపోవడానికి ఇదేమీ మొదటిసారి కాదు.. 2016లో కూడా శివలింగం కేవలం పది రోజుల్లోనే కరిగిపోయింది. గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. నిరంతరం పెరుగుతున్న ఉష్ణోగ్రత, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ధోరణి కొనసాగుతోందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మతపరమైన విశ్వాసాల ప్రకారం.. అమర్‌నాథ్ యాత్ర చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని, వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. అమర్‌నాథ్ యాత్ర హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే, ప్రస్తుతం సహజసిద్ధమైన మంచు శివలింగం కరిగిపోయినప్పటికీ ఆ పవిత్ర స్థలానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత కారణంగా భక్తులు నిరుత్సాహపడకుండా భారీ సంఖ్యలోనే తరలివస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం కల్పించిన కట్టుదిట్టమైన భద్రత, వసతులపై యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv