AP Rains : తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండగా..
కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ఏపీలో వర్షాలపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
రాబోయే 24గంటల్లో వాయుగుండం విదర్భ, పరిసర ప్రాంతాల్లోని దక్షిణ మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో శుక్రవారం ఏపీలోని పలు జిల్లాల్లో భీకర గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ (శుక్రవారం) మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతోపాటు భీకర స్థాయిలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆ సమయంలో చెట్ల కింద, హోర్డింగ్స్,విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని సూచించారు.
ఇదిలాఉంటే.. ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 28.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అదే జిల్లాలోని అరకులో 28 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు.. కర్ణాటక, మహారాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదిలోకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా.. ఈ నెల 27 నుంచి జూరాల ద్వారా నీటి ప్రవాహం మొదలుకాగా.. డ్యాంలో నీటిమట్టం పెరుగుతోంది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయినీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 46.8234 టీఎంసీలుకు చేరింది. కేవలం ఒకటిన్నర రోజు వ్యవధిలో 4.67 టీఎంసీల నీరు డ్యాంకు చేరింది.

