Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bhubaneswar : భువనేశ్వర్‌లో భయానక ఘటన.. కారును ఢీకొట్టి 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. వీడియో వైరల్.. నుజ్జునుజ్జైన కారు

Bhubaneswar : భువనేశ్వర్‌లో భయానక ఘటన.. కారును ఢీకొట్టి 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. వీడియో వైరల్.. నుజ్జునుజ్జైన కారు

10tv 1 week ago

Bhubaneswar : ఒడిశాలోని భువనేశ్వర్ నగరంలో భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ ట్రక్కు కారును ఢీకొట్టి సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. బ్రిడ్జిపైకి వెళ్లిన తరువాత ట్రక్కు ఆగిపోయింది..

ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. అయితే, కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తె ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన తరువాత ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ట్రక్కు డ్రైవర్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

నివేదిక ప్రకారం.. సత్య విహార్ ప్రాంత సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సమయంలో డ్రైవర్ ట్రక్కును ఆగకుండా అతివేగంగా పోనిచ్చాడు. ఈ క్రమంలో ట్రక్కు ఓ కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కారును పలాసుని బ్రిడ్జి వైపు దాదాపు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఆ భారీ ట్రక్కు కారును ఈడ్చుకెళ్తున్న క్రమంలో కారులోని తండ్రి, కుమార్తె ప్రాణభయంతో కేకలు పెట్టారు.

స్థానిక వాహనదారులు ట్రక్కు డ్రైవర్ ను హెచ్చరిస్తూ వాహనం ఆపాలంటూ బిగ్గరగా కేకలు వేశారు. ట్రక్కు చివరకు పలాసుని వంతెనపై ఆగిపోయింది. ఆ వెంటనే డ్రైవర్ ట్రక్కు నుంచి దూకి పరారయ్యాడు. స్థానిక వాహనదారులు కారులోని తండ్రి, కుమార్తెను బయటకు తీశారు. వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మంచేశ్వర్ పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని ట్రక్కును అక్కడి నుంచి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. కారును ఢీకొట్టిన సమయంలో ట్రక్కు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా ..? ఏదైనా మత్తు పదార్థాలను తీసుకున్నాడా..? ట్రక్కులో ఏఏ వస్తువులను తరలిస్తున్నాడు.. అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో భువనేశ్వర్‌లో రోడ్డు భద్రత, ముఖ్యంగా భారీ వాణిజ్య వాహనాల నియంత్రణపై మళ్లీ చర్చ మొదలైంది. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv