Biryani Price hike : సండే వచ్చిందంటే చాలు.. ఎక్కువశాతం మంది నాన్‌వెజ్ ప్రియులు తమ స్నేహితులు లేదంటే కుటుంబ సభ్యులతో రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్తుంటారు.
అక్కడ బిర్యానీ ఆర్డర్ చేసుకొని పుష్టిగా తేనేసి వస్తుంటారు. అయితే, బిర్యానీ ప్రియులకు షాకిచ్చేలా రెస్టారెట్లు, బిర్యానీ పాయింట్ల యాజమానులు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. కమర్షియల్ గ్యాస్ ధరను దాదాపు రూ.వెయ్యికి పెంచిన నేపథ్యంలో బిర్యానీ ధరలను భారీగా పెంచేందుకు అంటే సుమారు రూ.50వరకు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. అదేజరిగితే బిర్యానీ ప్రియులకు షాకింగ్ న్యూస్ అవుతుందని చెప్పొచ్చు.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్, చమురు సరఫరా నిలిచిపోయి ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారత దేశంలోనూ చమురు, గ్యాస్ కొరత వేధిస్తోంది. ముఖ్యంగా గ్యాస్ కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. తాజాగా.. రెండు రోజుల క్రితం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి సుమారు రూ. వెయ్యి పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఒకపక్క గ్యాస్ సిలిండర్ దొరకడం కష్టమవుతుండగా.. మరోవైపు ధరను భారీగా పెంచడంతో హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకుల కష్టాలు ఎక్కువయ్యాయి.
మొన్నటి వరకు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,400 వరకు ఉండేది. కేంద్రం ఒక్కసారిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. వెయ్యి పెంచేసింది. దీంతో ప్రస్తుతం ఒక్కో కమర్షియల్ సిలిండర్ గ్యాస్ రేటు రూ.3400కు చేరింది. ప్రస్తుతం గ్యాస్ కొరత నేపథ్యంలో సిలిండర్లు ఆశించిన స్థాయిలో దొరికే పరిస్థితి లేదు. దీంతో చాలా మంది హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు అదనంగా మరో రూ.2వేలు చెల్లించి బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్న పరిస్థితి. దీంతో ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ క్రమలో బిర్యానీ ధరలను పెంచేందుకు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఒక్కో ప్లేట్ బిర్యానీపై ప్రస్తుతం ఉన్న ధరకంటే అదనంగా మరో రూ.50 పెంచేందుకు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు సిద్ధమయ్యారని సమాచారం. అదేజరిగితే నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూసే అవుతుంది. రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి బిర్యానీ తినేవారు ఇక నుంచి కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఇరానీ ఛాయ్‌కు ఎంతో డిమాండ్ ఉంది. వీటి ధరలు కూడా పెంచేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారట. మొత్తానికి కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధర ఒక్కసారిగా దాదాపు రూ.వెయ్యి పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్ల, చాయ్ దుకాణాల నిర్వాహకులు ధరలను అమాంతం పెంచేందుకు సిద్ధమవుతున్నారు.

