Dailyhunt
BJP Telangana : బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ?.. మోదీ సభతోనే సమరశంఖం.. ఏ ఫార్ములాతో ముందుకి?

BJP Telangana : బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ?.. మోదీ సభతోనే సమరశంఖం.. ఏ ఫార్ములాతో ముందుకి?

10tv 1 week ago

BJP Telangana : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వేళ బీజేపీ తెలంగాణ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. 2025, నవంబర్ లో బిహార్ ఫలితాలు వెల్లడైన రోజు..

పశ్చిమ బెంగాల్ బీజేపీ తన ఎక్స్ ఖాతాలో నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ అనే ట్వీట్ చేసింది. అన్నట్లుగానే ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ మమతా బెనర్జీ తృణముల్ కాంగ్రెస్ పార్టీని కోలుకోని రీతిలో చావుదెబ్బ కొట్టి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. పశ్చిమబెంగాల్, అస్సోం, పుదుచ్చేరీలో ఘన విజయం దిశగా దూసుకెళ్తొన్న బీజేపీ.. తదుపరి టార్గెట్ తెలంగాణ అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పైగా బీజేపీ తెలంగాణ తన్ ఎక్స్ ఖాతాలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్ చేసింది. నెక్ట్స్ తెలంగాణ అంటూ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

పశ్చిమ బెంగాల్ విజయంతో ఫుల్లు జోష్ లో ఉన్న బీజేపీ.. తన తదుపరి లక్ష్యంగా తెలంగాణ రాజకీయాల్లో పాగా వేయడమే ధ్యేయంగా తన వ్యూహాలకు పదును పెడుతోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో.. కేంద్ర నాయకత్వం ఇక తన పూర్తి దృష్టిని తెలంగాణపై సారించింది. ఈ వ్యూహంలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్నారు. మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ తెలంగాణకు రావడ ఇదే ప్రథమం. దీంతో మోదీ తెలంగాణ పర్యటనపై ఇటు రాజకీయ వర్గాల్లో, అటు సామాన్య ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తెలంగాణలో బీజేపీ బలోపేతానికి మోదీ సభతోనే సమరశంఖం పూరించబోతుంది. జెన్ జీ లక్ష్యంగా.. అభివృద్ధే మంత్రంగా బీజేపీ.. తెలంగాణలో పాతుకుపోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా.. తెలంగాణ అభివృద్ధికి భారీగా వరాలను ప్రకటించనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు రూ. 8,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మోదీ శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా..కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందనే స్పష్టమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.

తెలంగాణలో పట్టు కోసం పార్టీబలోపేతం కోసం.. మోదీ చరిష్మానే ప్రధాన అస్త్రంగా మార్చుకోవలని బీజేపీ భావిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో వచ్చిన అనూహ్య ఫలితాలు, పెరిగిన ఓటు బ్యాంకును ఆసరాగా చేసుకుని.. మోదీ సభ ద్వారా రాష్ట్ర కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నారు. కేవలం భావోద్వేగ అంశాలే కాకుండా, కేంద్ర పథకాల లబ్ధిదారులను ఓటు బ్యాంకుగా మార్చుకునేలా ప్రధాని ప్రసంగం ఉండబోతోంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ మరియు బలహీనపడిన బీఆర్ఎస్ మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేయాలని చూస్తోంది. ప్రధాని మోదీ త్వరలో తెలంగాణలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభను ఎన్నికల ప్రచారానికి మలుపుగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోంది.

బీజేపీ 'విజయ్' ఫార్ములా
తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ 'జెన్ జీ' యువతను ఆకట్టుకుని ఎలాగైతే ప్రభంజనం సృష్టించిందో, అదే తరహాలో తెలంగాణలోనూ 'యూత్ & డెవలప్‌మెంట్' ఫార్ములాను బీజేపీ అమలు చేయనుంది:

కింది స్థాయి నుంచి బలోపేతం:

ప్రతి పోలింగ్ బూత్‌లో 'డిజిటల్ వాలంటీర్లను' నియమించి, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.

సంక్షేమం + వికాసం:

అటు హిందుత్వ ఎజెండాను కొనసాగిస్తూనే, ఇటు మౌలిక సదుపాయాల కల్పన మరియు నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా పోరాడటం.

బహుజన సమీకరణం:

బీసీ అస్త్రాన్ని బలంగా ప్రయోగిస్తూ, సామాజిక న్యాయం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవడం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు, రాబోయే స్థానిక సంస్థల (పరిషత్) మరియు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడమే ఈ పర్యటన యొక్క అంతిమ లక్ష్యం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv