- ఢిల్లీలో దారుణ సామూహిక అత్యాచారం
- డ్రైవర్, కండక్టర్ అరెస్ట్
- పోలీసులు బస్సును సీజ్ చేశారు
Delhi Gangrape: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి నిర్భయ తరహా ఘోర ఘటన చోటుచేసుకుని తీవ్ర కలకలం రేపింది.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల 11వ తరగతి బాలికపై కదులుతున్న స్లీపర్ బస్సులో డ్రైవర్, కండక్టర్ అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. చదువు విషయంలో తల్లి తిట్టడంతో ఆగస్టు 4న ఇంట్లోంచి బయటకు వచ్చిన ఆ బాలిక, నోయిడాలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘాతకం జరిగింది. డ్రైవర్, కండక్టర్ల మాయమాటలు నమ్మి బస్సు ఎక్కడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.
మాయమాటలు చెప్పి ఎక్కించుకుని అఘాయిత్యం:
భారీ వర్షం కారణంగా గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వద్ద ఆగిపోయిన బాలిక, ఖాళీగా వస్తున్న స్లీపర్ బస్సును ఆపింది. మరమ్మతులు ముగించుకుని వస్తున్న ఆ బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న డ్రైవర్, కండక్టర్లు ఆమెకు మాయమాటలు చెప్పి లోపలికి ఎక్కించుకున్నారు. అనంతరం ఆమెను బెదిరించి ఇద్దరూ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని బయటకు చెబితే ప్రాణాలు తీస్తామని హెచ్చరిస్తూ కశ్మీరీ (Delhi Gangrape)గేట్ ఐఎస్‌బీటీ సమీపంలో ఆమెను దింపి వెళ్లిపోయారు.
పోలీసుల వేగవంతమైన చర్యలు, నిందితుల అరెస్ట్:
బాధితురాలు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేగంగా స్పందించి నిందితులైన డ్రైవర్, కండక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలు సేకరించడానికి మరియు ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఆ స్లీపర్ బస్సును అధికారులు సీజ్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, నిందితులపై కఠిన చట్టాల కింద చర్యలు చేపడుతున్నారు.

