- 2020లో ఆర్‌సీబీతోనే ఐపీఎల్ అరంగ్రేటం చేసిన పడిక్కల్
- ఆ తరువాత కొన్నాళ్ల పాటు ఆర్ఆర్, లక్నోకు ప్రాతినిధ్యం
- 2025 వేలంలో మళ్లీ ఆర్‌సీబీలోకి
- తన కెరీర్ టర్నింగ్ పాయింట్ ఇదేనని వెల్లడి
Devdutt Padikkal : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టులోకి తిరిగి రావడమే తన కెరీర్‌కు టర్నింగ్ పాయింగ్ అని భారత క్రికెటర్ దేవ్‌దత్ పడిక్కల్ తెలిపాడు. తాను ఎలాంటి క్రికెట్ ఆడాలనుకుంటున్నాననే విషయంపై పూర్తి స్పష్టత వచ్చిందన్నాడు. 2025లో ఆర్‌సీబీ తరుపున పడిక్కల్ అదరగొట్టాడు. 10 మ్యాచ్‌ల్లో 150.61 స్ట్రైక్‌రేటుతో 247 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా 201.82 స్ట్రైక్‌రేటుతో 111 పరుగులు చేశాడు.
తాజాగా ఆర్‌సీబీ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో పడిక్కల్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 2025 వేలం తన కెరీర్‌ను మలుపు తిప్పిందన్నాడు. తాను ఎలాంటి క్రికెట్ ఆడాలనుకుంటున్నానో, ఎలాంటి క్రికెటర్‌గా ఎదగాలనుకుంటున్నానో అనే దానిపై ఆర్‌సీబీకి తిరిగి వచ్చిన తరువాతనే పూర్తి స్పష్టత వచ్చిందన్నాడు.
'నేను ఓ సంవత్సరం పాటు ఎల్‌ఎస్‌జికీ ఆడాను. అయితే ఆ సీజన్ అంత గొప్పగా సాగలేదు. చాలా కష్టంగా అనిపించింది. అంతా డబ్బు మీదే ఆధారపడి ఉంటుందని నాకు అనిపించింది. ఒక ఫ్రాంచైజీ మీపై అంత డబ్బు చెల్లించి నమ్మకం ఉంచినప్పుడు, మీరు సరిగ్గా రాణించకపోతే వారిని నిరాశపరుస్తున్నట్లుగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో నా దగ్గర కూడా ఎలాంటి సమాధానాలు లేవు.
నేను దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఆ సీజన్ సాగిన తీరు, ఆ ఏడాది జరిగిన ఎన్నో విషయాల ప్రభావాన్ని బాగా తగ్గించింది. కానీ అదే సమయంలో.. మరింత మెరుగవ్వడానికి ప్రయత్నించాలనే ప్రేరణను, నాలో నిజమైన కసిని అది రగిలించింది. కొన్నిసార్లు అలాంటివి అవసరం. మీరు చేరాలనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టపడాలో గుర్తు చేయడానికి, మీ ప్రయాణంలో ఎదురయ్యే ఆ వైఫల్యాలు అవసరం.' అని పడిక్కల్ అన్నాడు.
2020లో ఐపీఎల్‌లో దేవ్‌దత్ పడిక్కల్ అరంగ్రేటం చేశాడు. తొలి సీజన్ ఆర్‌సీబీ తరుపుననే ఆడాడు. ఆ సీజన్‌లో 473 పరుగులు చేసి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత కొన్ని సీజన్లు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడాడు. 2025 మెగావేలంలో ఆర్‌సీబీ 2 కోట్ల కనీస ధరకు పడిక్కల్‌ను కొనుగోలు చేసింది.

