Dailyhunt
DMK Defeat : ఘోర పరాభవం.. మూడో స్థానానికి పడిపోయిన DMK.. ఓటమికి కారణం వారసుడేనా..?

DMK Defeat : ఘోర పరాభవం.. మూడో స్థానానికి పడిపోయిన DMK.. ఓటమికి కారణం వారసుడేనా..?

10tv 1 week ago

DMK Defeat : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే విజయ్ 100కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళ రాజకీయాల్లో విజయ్ సరికొత్త రాజకీయ చరిత్ర సృష్టించబోతున్నారు.

అయితే ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో మొన్నటి వరకు తమిళనాట అధికారంలో ఉన్న డీఎంకే మూడో స్థానంలోకి పడిపోయింది. ప్రస్తుతానికి డీఎంకే 58 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఈ ఓటమికి ముఖ్య కారణం వారసుడు ఉదయనిధి స్టాలినే అంటున్నారు. రాజకీయాల్లో మాట తూటా వంటిది. అందుకే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. నోరు ఉంది కదా అని ఇష్టారీతిన మాట్లాడుకుంటూ పోతే.. ఇదుగో చివరకు ఇలా చావుదెబ్బ తినాల్సి వస్తుంది. తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలే ఓటమికి ప్రధాన కారణమని చర్చించుకుంటున్నారు.

మరీ ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఉదయనిధి స్టాలిన్ అనేక సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూలతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్.. దాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలను మద్రాస్ హైకోర్టు సైతం తప్పు పట్టింది. మెజారిటీ ప్రజల మనోభావాలను కించపరుస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సీఎం స్టాలిన్ ఖండించకపోవడం.. తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. ఉదయనిధి అండ చూసుకుని పలువురు డీఎంకే నేతలు సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు.

ఇదేకాక.. తిరుప్పరకుండ్రం సుబ్రమణ్య స్వామి కొండ వివాదం కూడా డీఎంకేకు హిందువుల్లో తీవ్ర వ్యతిరేకతను మిగిల్చింది. ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో మొదటిదైన ఈ కొండపై సికందర్ దర్గా ఉందని ముస్లింలు, ఇది పూర్తిగా హిందువుల ఆలయ ఆస్తి అని హిందువులు వాదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కొండపై ఉన్న పవిత్ర స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. దీనికి మద్రాస్ హైకోర్టు అనుమతిచ్చినా.. స్టాలిన్ ప్రభుత్వం మాత్రం దాన్ని అమలుపర్చలేదు. దీనిపై తీవ్ర వివాదం రాజుకోవడమే కాక.. నిరసనలు సైతం జరిగాయి. కానీ అధికారంలో ఉన్న స్టాలిన్ ప్రభుత్వం మైనారిటీలను సంతృప్తి పరిచేందుకే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ సంఘటనలు అన్నీ డీఎంకేకి తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. అందుకే ద్రవిడ మోడల్, డెవలప్‌మెంట్ నమూనా అంటూ డీఎంకే ఎంత హడావుడి చేసినా జనాలు పెద్దగా పట్టించుకోలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv