Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gold Deposit Scheme : బాబోయ్.. ఇంట్లో బంగారం ప్రభుత్వానికి ఇచ్చేయాలా?

Gold Deposit Scheme : బాబోయ్.. ఇంట్లో బంగారం ప్రభుత్వానికి ఇచ్చేయాలా?

10tv 2 weeks ago

Gold Deposit Scheme : మీ ఇంట్లో బంగారం ఉందా? బంగారం మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేయాలా? మోదీ పిలుపుతో ఇప్పుడు అందరిలో ఇదే భయం మొదలైంది.. బాబోయ్ ఇంట్లో బంగారం మొత్తం ప్రభుత్వం తీసుకుంటుందా?

ఏంటి అనే ఆందోళన కనిపిస్తోంది. ఒకసారి బంగారాన్ని డిపాజిట్ చేస్తే తిరిగి ఇవ్వదని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి.

గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఏంటి? :
ఇంతకీ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఏంటి? ఈ పథకంలో పెట్టిన బంగారానికి భద్రత ఉండదా? అసలు ప్రభుత్వం ఈ బంగారాన్ని ఏం చేస్తుంది? డిపాజిట్ చేసిన బంగారాన్ని తిరిగి పొందాలంటే ఏం చేయాలి? ఎలాంటి నిబంధనలను పాటించాలి? అనేది చాలామందికి అవగాహన ఉండదు.

వాస్తవానికి, మీ బంగారాన్ని (Gold Deposit Scheme) ప్రభుత్వం తీసుకుని తిరిగి ఇవ్వదా? అంటే లేదు.. అలా ఉండదు. కేంద్ర ప్రభుత్వం లేదంటే బ్యాంకు మీ బంగారాన్ని బలవంతంగా తీసుకోవు. ఇది పూర్తిగా స్వచ్ఛంద పథకం. మీకు ఇష్టం ఉంటేనే బంగారం డిపాజిట్ చేయొచ్చు.

మీ వద్ద బంగారం ఉంటే.. అది నగలు లేదా బార్లు నాణేల రూపంలో ఉంటే అది తీసుకుని గుర్తింపు పొందిన సెంటర్లలో పరీక్షిస్తారు. బంగారం స్వచ్ఛతను కొలుస్తారు. ఆపై గోల్డ్ కరిగించి బిస్కెట్ల రూపంలోకి మారుస్తారు. మీ పేరుతో బ్యాంకులో గోల్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీరు ఇచ్చిన బంగారంపై వడ్డీ వస్తుంది.

మోదీ ఏమన్నారంటే? :
గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ కేవలం కొత్తగా దిగుమతి చేసుకున్న బంగారంపై ఆధారపడకుండా నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని వినియోగించుకోవాలని అన్నారు. అంటే.. విదేశాల నుంచి బంగారం కొనే బదులు దేశంలోనే ఉన్న బంగారం వినియోగించుకోవాలనేది ప్రభుత్వం ఉద్దేశం. గణాంకాలను బట్టి చూస్తే.. దేశంలోని భారతీయుల దగ్గర టన్నుల కొద్ది బంగారం ఉందని అంటున్నారు.

పరిశ్రమ అంచనాల ప్రకారం.. భారతీయ గృహాలు, ఆలయ ట్రస్టులు కలిసి సుమారు 30వేల నుంచి 32వేల టన్నుల బంగారాన్ని (3.8 ట్రిలియన్ డాలర్లు) ఉంటుంది. ఈ సంఖ్య ఇంకా 35వేల టన్నులుగా ఉండొచ్చని అంచనా. ఇందులో ఎక్కువ భాగం లాకర్లు, అల్మారాలు, ఖజానాలలో వాడకుండా పడిన బంగారమే ఉంది. ఇలాంటి బంగారాన్ని ప్రజల దగ్గర నుంచి తీసుకుని రీసైకిల్ చేయాలని భావిస్తోంది.

అదే నగలు తిరిగి వస్తాయా? రావా? :
అంటే.. మీరు బ్యాంకు లాకర్లలో బంగారం పెడితే అదే బంగారం తిరిగి తీసుకోవచ్చు. కానీ, ఈ గోల్డ్ స్కీమ్ ప్రకారం.. మీరు ఇచ్చిన అదే బంగారం మీ చేతికి రాదు. ఉదాహరణకు.. మీరు డిపాజిట్ చేసిన బంగారు ఆభరణాల్లో గాజులు, హారం, ఉంగరాలు ఎలా ఉన్నాయో అలా మాత్రం మీ చేతికి రావు.

అందుకే కుటుంబ వారసత్వంగా పొందే నగలను చాలామంది భారతీయులు ఈ పథకంలో పెట్టేందుకు ఇష్టపడరు. ఎందుకంటే.. మీ బంగారాన్ని ప్రభుత్వం కరిగించి శుద్ధి చేస్తుంది. ఆ తర్వాత పథకం మెచ్యూరిటీ సమయంలో గోల్డ్ లేదా క్యాష్ రూపంలో మార్కెట్ సమాన వాల్యూకు పొందవచ్చు.

బంగారాన్ని ప్రభుత్వం లాగేసుకుంటుందా? అనే మాటలో వాస్తవం లేదు. ప్రస్తుతానికి దేశంలో ఇలాంటి నిబంధన అంటూ ఏదిలేదు. గోల్డ్ డిపాజిట్ పథకంలో చేరడం అనేది పూర్తిగా మీ ఇష్టమే. అలాగే, ప్రభుత్వం కూడా ప్రతి ఇంటింటికీ వెళ్లి బంగారం తీసుకోదు కూడా.

మీరు బంగారం డిపాజిట్ చేస్తే దానికి సంబంధించి అధికారిక రికార్డులు ఉంటాయి. కానీ, చట్టబద్ధంగా చూస్తే అది స్వచ్ఛంద డిపాజిట్ అనమాట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభుత్వం మీ బంగారం స్వాధీనం చేసుకుంటుందనే ప్రచారం కేవలం పుకార్లు మాత్రమే.. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని గమనించాలి.

ఈ పథకాన్ని ఎందుకు తెచ్చింది? :
భారతీయుల వద్ద వేల టన్నుల బంగారం ఇళ్లలో, లాకర్లలో ఖాళీగా పడి ఉంది. దాంతో ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే కేంద్రం ఇలాంటి బంగారం మొత్తాన్ని బయటకు తీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థలోకి బంగారాన్ని తీసుకురావడం ద్వారా విదేశాల నుంచి బంగారం దిగుమతులు తగ్గుతాయి. అలాగే, దేశ, విదేశీ మారక నిల్వలపై కూడా క్రమంగా ఒత్తిడి తగ్గుతుంది.

ఈ గోల్డ్ స్కీమ్ అమల్లో ఉందా? :
ప్రస్తుతానికి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది 2025 మార్చి నుంచి కేంద్రం 5 నుంచి 7 ఏళ్లు, 12 నుంచి 15 ఏళ్లు మధ్య గోల్డ్ డిపాజిట్ పథకాన్ని ఆపేసింది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే షార్ట్-టర్మ్ డిపాజిట్లు ఒకటి నుంచి 3 ఏళ్లు వాణిజ్యపరంగా అందించే అవకాశం ఉంది.

సామాన్యులకు లాభమా? నష్టమా? :
మీరు ఇంట్లో లాకర్‌లో కన్నా ఇలా డిపాజిట్ చేస్తే మీ బంగారంపై వడ్డీ వస్తుంది. అలాగే భద్రతపై ఆందోళన అవసరం ఉండదు. లాకర్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంట్లో దాచిన బంగారంపై వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. మీ బంగారం డిపాజిట్ చేశాక అసలు నగలు మీ చేతికి తిరిగి రావు. మీరు డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీ రేట్లు పెద్దగా ఉండవని గమనించాలి.

ఎందుకంటే.. ప్రస్తుతం ఈ డిపాజిట్ స్కీమ్ పరిమిత స్థాయిలో మాత్రమే ఉంది. వాస్తవానికి, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది మీ బంగారాన్ని బలవంతంగా లాగేసుకునే పథకం కాదని గమనించాలి.

మీకు మీరుగా స్వచ్ఛందంగా బంగారాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దానిపైనే వడ్డీ పొందవచ్చు. ఇందులో మీరు ఇచ్చిన అదే నగలు మాత్రం తిరిగి రావు. ఆ బంగారం నగలను కరిగించి శుద్ధి చేస్తారు అనమాట.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv