- కేంద్రం కీలక నిర్ణయం
- కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది
- ఒక్కో సిలిండర్ పై రూ. 993 పెంపు
LPG Gas Cylinder Price : గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది.
ఇవాళ మే నెల ప్రారంభం కావడంతో గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. అయితే, ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సంక్షోభం ఏర్పడింది. ఇప్పటికే గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధరలను సైతం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెంచింది. రానున్న రోజుల్లో గ్యాస్ కొరత తీవ్రమవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా రూ.993 పెంచింది. డొమెస్టిక్ గ్యాస్ ధరలను మాత్రం కేంద్రం పెంచలేదు. అయితే, పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంది.
ఇదిలాఉంటే.. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభంకాగా.. అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరలు మూడుసార్లు పెరిగాయి. మార్చిలో రూ.144, ఏప్రిల్ ఒకటిన రూ.195, ఇప్పుడు అమాంతం రూ.993 పెరిగింది.
ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, తాజాగా పెరిగిన ధరలతో కమర్షియల్ సిలిండర్ రేటు రూ.3వేలు దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 19కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,071కి చేరగా.. ముంబైలో రూ. 3,024కి చేరింది. హైదరాబాద్ అయితే రూ. 3,315కి చేరింది.
తాజాగా పెంచిన ధరలు రెస్టారెంట్లు, హోటల్స్ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కేంద్రం కమర్షియల్ సిలిండర్ ధర పెంచిన నేపథ్యంలో హోటళ్ల నిర్వాహకులుసైతం ధరలను పెంచేశారు. తాజాగా.. ఒక్కో కమర్షియల్ సిలిండర్ పై రూ.993 పెరగడంతో.. హోటళ్ల నిర్వాహకులు ఆహార పదార్థాలను ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది.

