- తొలి మ్యాచ్ తరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ముంబై
- ఈ మూడు మ్యాచ్‌ల్లో ఆడని ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ విల్‌జాక్స్
- కారణం చెప్పిన హెడ్ కోచ్ మహేలా జయవర్థనే
Mahela Jayawardene : ఐపీఎల్ 2026 సీజన్‌ను విజయంతో ఆరంభించింది ముంబై ఇండియన్స్. ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది. ఆ తరువాత ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం జట్టు కూర్పుతో ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ కు తుది జట్టులో స్థానం దక్కకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లాండ్ తరుపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన విల్ జాక్స్ నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. మొత్తంగా టీ20 ప్రపంచకప్‌లో అతడు 56.5 సగటుతో 176.58 స్ట్రైక్‌రేటుతో 226 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఇలాంటి ఆటగాడికి ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తాము ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ బెంచ్‌కే పరిమితం చేసింది.
ఇక ఇదే విషయమై మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్థనేకు ప్రశ్న ఎదురైంది. విల్ జాక్స్ ఇంకా జట్టుతో చేరలేదని మహేలా జయవర్థనే చెప్పుకొచ్చాడు. త్వరలోనే అతడు జట్టుతో చేరతాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అయితే.. విల్ జాక్స్ ఇంత వరకు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
RR vs MI : వైభవ్‌ను ప్రత్యేకంగా అభినందించిన హార్దిక్ పాండ్యా.. నువ్వు గొప్పొడివి సామీ..
ఇదిలా ఉంటే.. గత ఐపీఎల్ సీజన్‌లో విల్ జాక్స్ ముంబై తరుపున ఓ మోస్తరు ప్రదర్శన చేశాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 135.46 స్ట్రైక్‌రేటుతో 233 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 6 వికెట్లు పడగొట్టాడు.
కాగా.. విల్ జాక్స్ వీలైనంత త్వరగా భారత్‌కు వచ్చి ముంబై జట్టుతో కలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

