Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MS Dhoni Birthday: ఎంఎస్ ధోనీ 45వ పుట్టిన రోజు.. టికెట్ కలెక్టర్ టూ ట్రోఫీ కలెక్టర్‌..

MS Dhoni Birthday: ఎంఎస్ ధోనీ 45వ పుట్టిన రోజు.. టికెట్ కలెక్టర్ టూ ట్రోఫీ కలెక్టర్‌..

10tv 1 week ago

MS Dhoni Birthday : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టిన రోజు నేడు (జూలై 7). 45వ వసంతంలోకి అడుగుపెట్టిన ధోనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా.. తన క్రికెట్ ప్రయాణం, సాధించిన ఘనతలను ఓ సారి చూద్దాం..

క్రీడా చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రయాణాలలో ధోనీది ఒకటి. రైల్వే స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన అతను, కెప్టెన్‌గా జట్టుకు 2007 టీ20 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను అందించి భారత దేశానికి అతి పెద్ద ట్రోఫీ కలెక్టర్‌గా ఎదిగాడు.

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ధోని తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి నాళ్లలో బంతిని బలంగా బాదే ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అతడు కాలక్రమేణా, తన వ్యూహాత్మక దూకుడు, అద్భుతమైన ఎత్తుగడలతో జట్టును విజయాల వైపు నడిపించే ఫినిషర్‌గా మారాడు.

టీమ్ఇండియా తరపున అన్ని ఫార్మాట్లలో 538 మ్యాచ్‌లు ఆడాడు. 17,266 అంతర్జాతీయ పరుగులు చేశాడు. 829 డిస్మిసల్స్ లో పాలు పంచుకున్నాడు. 350 వన్డేల్లో 50.57 సగటుతో 10,773 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 183 నాటౌట్.

200 వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అతడి సారథ్యంలో భారత్ 110 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 74 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఐదు మ్యాచ్‌లు టై కాగా.. 11 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 37.60 సగటుతో 126.13 స్ట్రైక్ రేట్‌తో 1,617 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 56.

అతని బ్యాటింగ్ గణాంకాలు బాగానే ఉన్నప్పటికీ కూడా అతని నాయకత్వమే అతని టీ20ల్లో గొప్ప ఆటగాడిని చేసింది. 2007లో టీమ్ఇండియాకు తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను అందించి భారత క్రికెట్‌లో ఓ కొత్త శకానికి పునాది వేశాడు. అభిమానులు ముద్దుగా 'మహి' అని పిలుచుకునే ధోని 72 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 41 మ్యాచ్‌ల్లో విజయాలను అందించాడు. 28 మ్యాచ్‌ల్లో ఓడిపోగా ఓ మ్యాచ్ టైగా ముగిసింది. మరో రెండు మ్యాచ్‌లు ఫలితం తేలలేదు.

ఇక టెస్టుల విషయానికి వస్తే.. 90 మ్యాచ్‌లు ఆడి 38.09 సగటుతో 4,876 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 224. టెస్టుల్లో టీమ్ఇండియాకు 60 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో భారత్ 27 మ్యాచ్‌ల్లో గెలవగా, 18 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 15 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ధోని సారథ్యంలో భారత్ తొలిసారిగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానానికి చేరింది.

2010-11, 2012-13 స్వదేశీ సిరీస్‌లలో 4-0 తేడాతో ఘన విజయాలు సాధించి, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసిన ఏకైక భారత కెప్టెన్‌గా చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv