- సహజవాయువుపై ఆంక్షల ఎత్తివేత
- సాధారణ స్థితికి ఎల్ఎన్‌జీ రవాణా
- పరిశ్రమలకు లభించిన భారీ ఊరట
Natural Gas Supply: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయ ఇంధన రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి శాంతి వాతావరణం నెలకొనడంతో, సహజవాయువు (Natural Gas Supply) సరఫరాపై గతంలో విధించిన అత్యవసర ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. హర్మూజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు (LNG) రవాణా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడంతో, 'నేచురల్ గ్యాస్ (సరఫరా నియంత్రణ) ఆర్డర్, 2026' ను సవరిస్తూ పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా సముద్ర మార్గంలో ఎల్ఎన్‌జీ నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సరఫరా సంస్థలు 'ఫోర్స్ మేజర్' ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఈ ఏడాది మార్చి 9న అత్యవసర నిబంధనలను తెచ్చింది. ఆ సమయంలో లభ్యత తక్కువగా ఉండటంతో దేశీయ, దిగుమతి గ్యాస్‌ను కేవలం గృహ అవసరాలు, రవాణా (సీఎన్‌జీ), ఎరువుల కర్మాగారాల వంటి అత్యవసర రంగాలకే పరిమితం చేసింది. విద్యుత్, పెట్రోకెమికల్స్ వంటి పరిశ్రమలకు సరఫరాలో కోతలు విధించింది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో కాల్పుల విరమణ అమలు కావడం, శాంతి చర్చలు సఫలం కావడంతో సముద్ర రవాణా కష్టాలు తొలిగిపోయాయి. సంక్షోభ సమయంలో ఇంధన భద్రత కోసం విధించిన ఆంక్షల్లో ప్రభుత్వం ఎత్తివేసిన చివరి నిబంధన ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఎల్పీజీ ఉత్పత్తి, బల్క్ డీజిల్ అమ్మకాలపై ఆంక్షలను ఉపసంహరించుకున్న కేంద్రం, తాజా నిర్ణయంతో పరిశ్రమలు, సిటీ గ్యాస్ కంపెనీలకు మునుపటిలాగే సాధారణ వాణిజ్య ఒప్పందాల ప్రకారం గ్యాస్ కేటాయింపులు జరగనున్నట్లు స్పష్టం చేసింది.

