Dailyhunt
Nominated Posts: ఇంకెన్నాళ్లీ వెయిటింగ్? నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఆలస్యమెందుకు.. పదవుల భర్తీకి బ్రేకులు వేస్తున్నదెవరు..

Nominated Posts: ఇంకెన్నాళ్లీ వెయిటింగ్? నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఆలస్యమెందుకు.. పదవుల భర్తీకి బ్రేకులు వేస్తున్నదెవరు..

10tv 5 days ago
  • నామినేటెడ్ పోస్టుల ఆలస్యం వెనుక ఏం జరుగుతోంది.?
  • పదవుల కోసం రెండున్నరేళ్లుగా ఆశల పల్లకిలో నేతలు
  • రేపోమాపో అంటూ ప్రకటనలు..పెండింగ్‌లో పదవుల భర్తీ
  • అసలు నామినేటెడ్ పదవుల భర్తీకి బ్రేకులు వేస్తున్నదెవరు?

Nominated Posts: ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావొస్తోంది. ఈ టైమ్‌లో మంచి ముహూర్తాలు, పండుగలు, గడువులు అన్ని దాటిపోయాయి. కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీపై మాత్రం ముందడుగు పడటం లేదు. త్వరలో పదవులు భర్తీ అంటూ పీసీసీ చీఫ్ స్టేట్‌మెంట్స్ రిపీట్స్‌..అయినా ఆలస్యమెందుకు? నామినేటెడ్ పదవుల నియామకానికి ఎక్కడ బ్రేకులు పడుతున్నాయి? ఇప్పుడిదే కాంగ్రెస్‌ పార్టీలో ఆసక్తికర చర్చగా మారింది. ఆశావహులు తమ ప్రొఫైల్ పట్టుకొని ఢిల్లీ వెళ్లినా ఫలితం ఉండటం లేదా? పీసీసీ చీఫ్ మాట ఇస్తున్నా..నేతలకు నమ్మకం పోతోందా? ఏఐసీసీ నేతలు ఖర్గే, కేసీ వేణుగోపాల్ చెప్పినా పదవుల భర్తీకి అడ్డంకులెందుకు?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతున్నా..పదవుల భర్తీపై ముందుడగు పడటం లేదు. రేపో మాపో పదవుల భర్తీ ఉంటుందన్న ప్రతిసారి ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికీ పదిసార్లు డెడ్ లైన్‌లు ప్రకటించినా పదవుల భర్తీ మాత్రం జరగడం లేదు. ఆ మధ్య ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ వచ్చి పదవులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించినా ప్రాసెస్‌ పరుగులు పెట్టడం లేదు. దీంతో పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. కష్టపడ్డాం..పదవీయోగ్యం పక్కా అని ఆశల్లో ఉన్న నేతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో సొంత పార్టీ నేతలను, ప్రభుత్వ పెద్దలను ఏం అనలేక అసహనం, ఆవేదనతో రగిలిపోతూ..కాలం గడిపేస్తున్నారట హస్తం పార్టీ నేతలు.

యువత, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం..

త్వరలోనే ప్రభుత్వ పదవులను, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఆశావహుల లిస్ట్‌ను తెప్పించుకొని సామాజిక సమీకరణలు, పార్టీకి నేతలు చేసిన పని తదితర అంశాలపై ఆరా తీశారు. ఏ పదవికి ఎవరు సరిపోతారో లెక్కలు వేసుకొని మరి జాబితాను సిద్ధం చేశారు. యువకులకు, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి శ్రమించిన వాళ్లకు పదవులు ఇవ్వాలని హస్తం నేతలు భావించారు. నామినేటెడ్ పోస్టులు రాని వారికి పార్టీ పదవులు ఇవ్వాలని కూడా పార్టీ ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ సూచించారు. పోస్టుల భర్తీ కోసం పార్టీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి దాదాపు అరడజను సార్లు భేటీ అయ్యారు. పలు నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. అయినా సరే నామినేటెడ్ పదవుల భర్తీ మాత్రం వాయిదా పడుతూనే ఉంది.

పదవుల భర్తీకి ప్రధాన అడ్డంకి కాంగ్రెస్ నేతలే?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు దాదాపు 40 మందిని కార్పొరేషన్ ఛైర్మన్లుగా నియమించింది. ఇక మిగతా పోస్టులను భర్తీ చేసేందుకు అనేక సార్లు కసరత్తు పూర్తి చేసి జాబితా కూడా సిద్ధం చేసింది. కార్పొరేషన్ ఛైర్మన్లు, కుల సంఘాల కార్పొరేషన్ల ఛైర్మన్లు, వివిధ ప్రభుత్వ సంస్థల డైరెక్టర్లు, మెంబర్లు లాంటి అన్ని పోస్టులను లెక్కిస్తే దాదాపు వెయ్యి మందికి అవకాశం ఇవ్వొచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు క్యాబినెట్ హోదాతో కీలకమైన కార్పొరేషన్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇలా అందరి పేర్లతో జాబితా రెడీగా ఉన్నా..పదవుల భర్తీకి ప్రధాన అడ్డంకి కాంగ్రెస్ నేతలే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంత్రి పదవి ఆశించిన నేతలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తామంటే వాళ్లు మంత్రి అయితేనే తీసుకుంటామని తేల్చి చెప్పడంతో కొన్ని పదవులు భర్తీ చేయకుండా ఆపేశారు. ఇక పార్టీలో కీలకంగా ఉన్న పలువురు యువ నేతలకు కార్పొరేషన్ ఛైర్మన్లు ఇస్తామంటే తమకి ఎమ్మెల్సీ కావాలని పట్టుపడుతున్నట్లు సమాచారం. ఇక కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ కోసం స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, డీసీసీ అధ్యక్షుడి మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని టాక్. పదవుల కోసం ఎమ్మెల్యే ఒక పేరు ప్రపోజ్ చేస్తే, మంత్రి మరో పేరును ప్రతిపాదిస్తున్నారు. ఇక డీసీసీ అధ్యక్షుడు మరో వ్యక్తిని బలపరచడంతో ఏకాభిప్రాయానికి కుదరట్లేదట.

పాజిటివ్ కంటే నెగెటివ్ ఎక్కువగా ఉంటుందనే భయం..

ఇక మహిళలు, యువకులు, సామాజిక సమీకరణలు ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకొని పదవులను భర్తీ చేయడం కాంగ్రెస్ పెద్దలకు హెడెక్‌గా మారిందట. పదవుల భర్తీ చేస్తే భంగపడిన వారి నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదనే చర్చ కూడా ఉంది. ఇక పలు చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు కూడా పదవుల భర్తీ కోసం పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. తమ అనుచరులకు, తమ మనుషులకు పదవులు ఇప్పించుకునేందుకు రాష్ట్ర పార్టీ పెద్దలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో పదవులను భర్తీ చేస్తే పాజిటివ్ కంటే నెగెటివ్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారట పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అందుకే ప్రతీసారి నామినేటెడ్ పోస్టుల నియామకం చివరి వరకు వచ్చి ఆగిపోతుందని హస్తం నేతలు చెబుతున్నారు.

ప్రభుత్వం తరపున భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టులు, పార్టీ తరపున ఇవ్వాల్సిన పోస్టుల జాబితాలు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీ కీలక పోస్టులు, నామినేటెడ్ పదవులను భర్తీ చేయాల్సిందేనని ఏమైనా వ్యతిరేకత వస్తే డ్యామేజ్ కంట్రోల్ చేసే బాధ్యతను ఇంచార్జీ మంత్రులు తీసుకోవాలని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఆలస్యం చేస్తే మరింత సమస్యగా మరే అవకాశం ఉందని..ఇప్పటికే నిర్ణయించిన కుల కార్పొరేషన్లు ఒకటి రెండు రోజుల్లో భర్తీ అయ్యే అవకాశం ఉందట. మిగతా వాటిని వచ్చే జూన్‌లో పాత వాటితో కలిపి భర్తీ చేస్తారట. నామినేటెడ్ పోస్టుల భర్తీ క్లైమాక్స్‌లో ట్విస్ట్‌లాగే కొనసాగుతుందో..లేక ఆశావహులకు పదవులు దక్కేదెప్పుడో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv