Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Prashant Kishor: 'సామానంతా షిఫ్ట్..' ఇక నుంచి ఆశ్రమంలో పీకే..

Prashant Kishor: 'సామానంతా షిఫ్ట్..' ఇక నుంచి ఆశ్రమంలో పీకే..

10tv 3 days ago

Prashant Kishor: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కొన్ని నెలల తర్వాత జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్.. పాట్నా శివార్లలోని ఒక ఆశ్రమానికి తరలివెళ్లినట్లు తెలిపారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నిలదొక్కుకునే వరకు తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తానని కిషోర్ చెప్పారు.

రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ తర్వాత రాజకీయ నాయకుడిగా మారారు. మంగళవారం రాత్రి పాట్నాలోని తన నివాసం నుండి ఆశ్రమానికి మారిపోయినట్లు తెలిపారు. “నిన్న రాత్రి నేను పాట్నాలో నివసిస్తున్న చోటు నుండి మారిపోయాను. ఐఐటి-పాట్నాకు సమీపంలో ఉన్న బిహార్ నవనిర్మాణ్ ఆశ్రమానికి వెళ్లిపోయాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ఆశ్రమమే నా నివాసంగా ఉంటుంది. ఆ ఎన్నికల్లో జన సూరజ్ పార్టీ ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నాను,” అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

కిషోర్ ఐ-ప్యాక్ అనే రాజకీయ సలహా సంస్థకు సహ వ్యవస్థాపకుడు కూడా. ఆయన ఆ సంస్థ నుండి వైదొలిగి 2024లో జన సూరజ్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ బీజేపీ ఎంపీ ఉదయ్ సింగ్ కుటుంబానికి చెందిన, పాట్నా విమానాశ్రయం సమీపంలో ఉన్న ‘షేక్‌పురా హౌస్’ అనే విశాలమైన బంగ్లా నుండి ఇప్పటివరకు ఆయన కార్యకలాపాలు నిర్వహించారు.

సింగ్ ఒక ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వారు. ఆయన అన్నయ్య ఎన్.కె. సింగ్, మాజీ రాజ్యసభ ఎంపీ. 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ కూడా. వారి దివంగత తల్లి మాధురి సింగ్ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు. పూర్నియా నుండి పలుమార్లు ఎంపీగా పనిచేశారు. జేడీ(యూ) మాజీ ఉపాధ్యక్షుడైన కిషోర్.. గత నెలలో రాజ్యసభలోకి ప్రవేశించేందుకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్‌పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

”ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల వల్ల జరుగుతున్న వలసలను ఆపలేకపోయారు. దానికి బదులుగా, తన కుమారుడికి ప్రభుత్వంలో పాగా వేసేలా చూసుకున్న తర్వాతే, ఆయన స్వయంగా వలస వెళ్లాలని నిర్ణయించుకున్నారు,” అని ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరిన నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్‌ను ఉద్దేశించి ప్రశాంత్ కిశోర్ అన్నారు.

10వేల కోసం ఓటు అమ్ముకోవద్దు..

కులం, మతం లేదా డబ్బు ప్రలోభాల ఆధారంగా ఓటు వేయకుండా తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన బీహార్ ఓటర్లను కోరారు. “బీహార్ ప్రజలు ఓటు వేసేటప్పుడు తమ సొంత పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వారు ప్రధాని నరేంద్ర మోదీ, నితీష్ కుమార్ లేదా లాలూ ప్రసాద్ వంటి నాయకుల మాటలకు ప్రభావితం కాకూడదు. అలాగే రూ.10వేల కోసం తమ ఓట్లను అమ్ముకోకూడదు,” అని ప్రశాంత్ కిశోర్ సూచించారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రారంభించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ఉద్దేశించి కిశోర్ ఇలా అన్నారు. ఈ యోజన కింద 1.5 కోట్లకు పైగా మహిళలు ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున అందుకున్నారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ ఖాతా తెరవడంలో విఫలమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv