Raksha Bandhan 2026 : అక్కాచెల్లెళ్లు అన్నాదమ్ముళ్ల అనుబంధానికి నిష్కల్మశమైన ప్రేమకు ప్రతీక రక్షాబంధన్. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంట్లో అపరిమితమైన ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపుతుంది.
చిన్నతనం నుంచి కలిసి పెరిగిన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఒకరి క్షేమాన్ని మరొకరు కోరుకునే అమూల్యమైన రోజు ఇది.
రక్షాబంధన్ పండుగను శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిధినాడు జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం.. ఆగస్టు 28వ తేదీ శుక్రవారం నాడు రాఖీ పండుగ వచ్చింది. రక్షాబంధన్ రోజున భద్రకాలం లేకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. భద్రకాలంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
పౌర్ణమి తిధి ఉన్న సమయంలో భద్రకాలం ముగిసిన తర్వాత వచ్చే మధ్యాహ్న సమయం లేదంటే ప్రదోషకాలం రాఖీ కట్టడానికి అత్యంత శ్రేష్టమైనవి. పలువురు పండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. 28వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30గంటల మధ్య సోదరుడి కుడి చేతికి రాఖీ కట్టాలని సూచించారు.
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం.. రాఖీ కట్టడానికి సమయం చాలా ముఖ్యమైనది. మధ్యాహ్నం సమయాన్ని అపరాహన కాలం అంటారు. రాఖీ కట్టడానికి ఇది అత్యంత ఉత్తమమైన ముహూర్తం. ఒకవేళ మధ్యాహ్నం వేళ రాఖీ కట్టడం వీలు కాకపోతే సూర్యాస్తమయం సమయంలో వచ్చే ప్రదోష కాలంలో రాఖీ కట్టవచ్చు. రాక్షస కాలాన్ని లేదా భద్రకాలాన్ని పూర్తిగా విస్మరించాలి. భద్రకాలంలో రాఖీ కట్టడం వల్ల అశుభాలు జరుగుతాయని నమ్ముతారు.

