Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Taliban New Rules: తాలిబన్ల కొత్త రూల్స్.. 'పెళ్లప్పుడు కన్య మౌనంగా ఉంటే..'

Taliban New Rules: తాలిబన్ల కొత్త రూల్స్.. 'పెళ్లప్పుడు కన్య మౌనంగా ఉంటే..'

10tv 1 week ago

Taliban New Rules: అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వారి పాలన పిచ్చోడి చేతిలో రాయి తరహాలో మారింది. పిచ్చి పిచ్చి రూల్స్ తో అక్కడి ప్రజలకు పిచ్చెక్కిస్తున్నారు.

మరీ ముఖ్యంగా మహిళలు, బాలికల హక్కులను కాల రాస్తున్నారు. రూల్స్ పేరుతో వారి స్వేచ్చను హరిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్ర విచిత్రమైన వివాదాస్పద నిబంధనలు తెచ్చారు తాలిబన్లు.

తాజాగా మరో వివాదాస్పదమైన కొత్త కుటుంబ చట్ట నిబంధనను ప్రవేశపెట్టారు తాలిబన్లు. ఇది కొన్ని షరతులకు లోబడి మైనర్ల వివాహాలను చట్టబద్ధంగా గుర్తిస్తుంది. ఈ చర్య అప్ఘానిస్తాన్‌లో మహిళలు, పిల్లల హక్కులపై అంతర్జాతీయ ఆందోళనను మళ్లీ రేకెత్తించింది. ‘భార్యాభర్తల మధ్య విడిపోవడానికి సంబంధించిన సూత్రాలు’ అనే పేరుతో ఉన్న ఈ 31-అంశాల నిబంధనను తాలిబన్ సర్వోన్నత నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా ఆమోదించాడు. ఇది మైనర్ల వివాహాలు, వివాహ రద్దులు, పురుష సంరక్షకుల అధికారాన్ని నియంత్రించే నియమాలను వివరిస్తుంది. మతపరమైన కోర్టులకు విస్తృత అధికారాలను కల్పిస్తుంది.

“ఖియార్ అల్-బులుగ్,” లేదా “యుక్త వయసు వచ్చిన తర్వాత చేసుకునే ఐచ్ఛికం”. ఇది ఇస్లామిక్ న్యాయ శాస్త్రంలోని ఒక భావన. దీని ప్రకారం చిన్న వయస్సులో వివాహం చేసుకున్న పిల్లలు యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత ఆ వివాహాన్ని రద్దు చేసుకోవడానికి అనుమతి పొందొచ్చు.

ఆర్టికల్ 5 ప్రకారం ఒక మైనర్ (అబ్బాయి లేదా అమ్మాయి) వివాహాన్ని వారి తండ్రి లేదా తాత కాకుండా ఇతర బంధువులు ఏర్పాటు చేసినప్పుడు, జీవిత భాగస్వామి సామాజికంగా అనుకూలంగా ఉన్నారని, కట్నం సముచితంగా ఉందని భావించినట్లయితే, ఆ వివాహ ఒప్పందం చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. ఈ నిబంధన ప్రకారం, యుక్త వయసుకు రాకముందే వివాహం చేసుకున్న పిల్లలు, యుక్త వయసుకు వచ్చిన తర్వాత మాత్రమే, అదీ కేవలం కోర్టు ఉత్తర్వు ద్వారా వివాహ రద్దు కోరవచ్చు.

కన్య మౌనం అంగీకారమే..

తాలిబన్లు తెచ్చిన ఒక కొత్త రూల్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆర్టికల్ 7 ప్రకారం యుక్త వయసు వచ్చిన తర్వాత కన్య మౌనాన్ని వివాహానికి అంగీకారంగా పరిగణించవచ్చు. అయితే ఒక బాలుడు లేదా ఇదివరకే వివాహం చేసుకున్న స్త్రీ మౌనం వహించడం దానంతట అదే అంగీకారంగా పరిగణించబడదు.

ఈ డిక్రీ.. ఇస్లాం నుండి వైదొలగడం, భర్త దీర్ఘకాలం పాటు అందుబాటులో లేకపోవడం, వ్యభిచార ఆరోపణలు, “జిహార్” వంటి విస్తృత మతపరమైన కారణాల కింద వైవాహిక వివాదాలలో జోక్యం చేసుకోవడానికి తాలిబన్ మత న్యాయస్థానాలకు విస్తృత అధికారాలను మంజూరు చేస్తుంది. “జిహార్” విభాగానికి సంబంధించి, భర్తలను మతపరమైన శిక్షలను పాటించేలా బలవంతం చేయడానికి లేదా విడాకులు మంజూరు చేయడానికి న్యాయమూర్తులకు అధికారం ఉంది.

అఫ్ఘానిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన పేదరికాన్ని ఎదుర్కొంటున్న కుటుంబాలు డబ్బు కోసం చాలా చిన్న వయసు గల బాలికలకు వివాహాలు జరిపించే పద్ధతులను ఈ నిబంధనలు మరింత సంస్థాగతం చేస్తున్నాయని మానవ హక్కుల సంస్థలు వాపోతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv