Techie To Female Auto Driver : బతకాలంటే బోలెడు మార్గాలున్నాయి.. అది కూడా అన్యాయం, అక్రమాలకు పాల్పడకుండా.. ఒకరి జేబు కొట్టకుండా. కాకపోతే అలా బతికే విధానాలను ప్రతి ఒక్కరూ ఆమోదించలేరు.
కారణం సమాజం గురించి ఆలోచించి.. వెనకడుగు వేస్తారు. గొప్ప ఉద్యోగం, నెలకు లక్షల్లో జీతం, లేదంటే విదేశాల్లో ఉద్యోగం, సర్కార్ కొలువు ఇవే ఉద్యోగాలు.. ఇవి చేసే వారికే సమాజంలో గౌరవ మర్యాదలు. కాదని తమ మనసుకు నచ్చిన పని చేద్దామనుకుంటే సమాజం గురించి ఆలోచించి ముందు కుటుంబ సభ్యులే ఆ ఆలోచనను వ్యతిరేకిస్తారు. కానీ వారి మాటలు వదిలేసి.. ఒక్కసారి ధైర్యంగా ముందడుగు వేస్తే.. ఇదుగో ఈ మహిళా టెకీలా మన జీవితంలో కూడా సంతోషాలు వెల్లివిరుస్తాయి.
ఐటీ మేనేజర్ గా మంచి సాలరీ.. కుటుంబంలో గౌరవం.. కానీ విపరీతమైన పని ఒత్తిడి. దాన్ని భరించలేక ఉద్యోగానికి రిజైన్ చేసిన ఓ కేరళకు చెందిన మహిళా టెకీ ఒకరు.. ప్రస్తుతం ఆటో నడుపుతూ నెలకు రూ.60 వేలు సంపాదిస్తున్నారు. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆమె ఎంతో సంతోషంగా, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఈ మహిళా టెకీ వీడియోని తెలంగాణ ప్రభుత్వ అధికారిక చానెల్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడిది వైరల్ అవుతోంది.
సదరు మహిళ 9 సంవత్సరాలుగా ఐటీ మేనేజర్ గా పని చేసింది. కానీ తీవ్రమైన పని ఒత్తిడి. టార్గెట్ రీచ్ అవ్వాలంటూ ఉరుకులు పరుగుల జీవితం. మంచి జీతం వస్తున్నా.. జీవితాన్ని ఆస్వాదించే స్థితిలో లేకపోవడం ఆమెను కలచి వేసింది. మరి ఈ సంపాదన ఎందుకు అనే ప్రశ్న మొదలైంది. ఇదే సమయంలో ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువైంది. అన్నింటి గురించి ఆలోచించి.. ధైర్యం చేసి చివరకు ఓ నిర్ణయం తీసుకుంది. పైసలు వస్తున్నా ప్రశాంతత లేని జీవితం వద్దనుకుని ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసింది.
ఆ తర్వాత ఒక ఆటో కొనుక్కుని.. దాన్ని నడుపుతూ నెలకు రూ.60 వేలు సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రయాణికురాలు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగా ఈ ఆసక్తికర విషయాలు తెర మీదకు వచ్చాయి. మగాళ్లు అధికంగా ఉండే ఈ రంగంలోకి వచ్చినందుకు తానేం భయపడలేదని.. కష్టపడి పని చేస్తే మహిళలు సాధించలేనిది ఏమీ లేదని తెలిపింది. ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతంగా జీవిస్తున్నానని.. పైగా ఆటో నడుపుతూ నెలకు రూ.60 వేలు సంపాదిస్తున్నానని తెలిపింది. ధైర్యంగా ముందడుగు వేస్తే ఈ లోకంలో బతికేందుకు బోలెడు అవకాశాలున్నాయని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది.

