- కల్యాణలక్ష్మి పథకంపై హైకోర్టులో విచారణ
- సింగిల్ బెంచ్ స్టేపై ప్రభుత్వం అప్పీల్
- తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది
Telangana High Court: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సంక్షేమ పథకాల చట్టబద్ధత, అమలుపై హైకోర్టులో కీలక విచారణ జరిగింది.
గతంలో ఈ పథకాలపై సింగిల్ బెంచ్ స్టే విధించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి (CJI) నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలో పేద వర్గాలకు ఆసరాగా నిలుస్తున్న ఈ పథకంపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.
పథకం ఉద్దేశం వివరిస్తూ ఏజీ వాదనలు:
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (AG) సుదర్శన్ రెడ్డి సీజే ధర్మాసనం ఎదుట బలమైన వాదనలు వినిపించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహాలకు ఆర్థికంగా చేయూత నందించడంతో పాటు, సమాజంలో ప్రధాన సమస్యగా మారిన బాల్య వివాహాలను సమర్థవంతంగా నిర్మూలించాలనే ఉన్నతమైన లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ పథకాలను తీసుకొచ్చిందని ఆయన వివరించారు. ఈ పథకాల వల్ల ఎంతో మంది పేద ప్రజలకు మేలు జరుగుతోందని కోర్టు(Telangana High Court)కు తెలియజేశారు.
పిటిషన్ కొట్టివేయాలని డిమాండ్:
సింగిల్ బెంచ్‌లో ఈ పథకాల చట్టబద్ధతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌కు అస్సలు విచారణార్హత లేదని ఏజీ స్పష్టం చేశారు. కాబట్టి ఆ పిటిషన్‌ను తక్షణమే కొట్టివేసి, స్టేను తొలగించాలని ఆయన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనల ప్రాథమిక పరిశీలన అనంతరం, సీజే ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

