- తెలంగాణకు రెయిన్ అలర్ట్..
- పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన మబ్బులు పట్టి ఉంటాయని, మధ్యాహ్నం లేదా సాయంత్రం తర్వాత వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని వివరించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండా లని అధికారులు హెచ్చరించారు.
ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ సహా 18 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా కామారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, మెదక్, సంగా రెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యా పేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ ల వద్ద ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

