- ఓటర్ల సవరణ గడువు పొడిగింపు
- ఆగస్టు 10 వరకు అవకాశం
- కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం
Telangana Sir Survey: తెలంగాణ ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక అవకాశం కల్పించింది.
రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Telangana Sir Survey) ప్రక్రియ గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల వివరాల నమోదు, సవరణల్లో ఏ ఒక్కరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈసీఐ మరోసారి గడువు పెంపు వైపు అడుగులేసింది. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేందుకు చివరి తేదీని ఆగస్టు 10 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
వాస్తవానికి ఈ గడువు మొదట జులై 24తో ముగియాల్సి ఉండగా, దానిని ఆగస్టు 3 వరకు విస్తరించారు. తాజాగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 10వ తేదీ వరకు మరోసారి పొడిగించారు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 77.12 శాతం ఎన్యూమరేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని ఈసీఐ తెలిపింది. అయితే గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్‌లో 56.31 శాతం, రంగారెడ్డిలో 63.43 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం మాత్రమే నమోదు కావడం వల్ల ఈ అదనపు గడువు ఉపయోగపడనుంది.

