Vizianagaram : ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. భార్య తన మీద పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆమె మీద కోపం పెంచుకున్న ఓ వ్యక్తి..
భార్యపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాలని భావించి.. ఆమెపై పెట్రోల్‌తో దాడి చేశాడు. ఈ సంఘటన జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో చోటుచేసుకుంది. ఒకటో పట్టణ ఎస్సై వెల్లడించిన వివరాల ప్రకారం.. సాలూరుకు చెందిన షేక్ గౌష్ అనే వ్యక్తికి.. విజయనగరంలోని ఆబాద్ వీధికి చెందిన మహిళతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది.
వీరికి ఇద్దరు సంతానం పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ తమ పిల్లలతో కలిసి.. నగరంలోనే నివాసం ఉంటున్నారు. గౌష్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా గౌష్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య.. మంగళవారం రాత్రి మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.
అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న గౌష్.. భార్య తన మీద పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది అని తెలుసుకుని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో పెట్రోల్ సీసాతో పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి, భార్యపై విసిరాడు. ఇది గమనించిన పోలీసులు అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గౌష్ పోలీసులపై కూడా పెట్రోల్ విసిరాడు. చివరకు అతడిని కంట్రోల్ చేసి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

