అప్పటివరకు ఆ ఇల్లంతా పసిపాప బోసినవ్వులు, కేరింతలతో కళకళలాడింది. సరిగ్గా నెల క్రితమే ఆ చిన్నారి మొదటి పుట్టినరోజును ఆ దంపతులు ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
కానీ, అంతలోనే ఏమైందో ఏమో.. ఆ పచ్చని సంసారంలో మృత్యువు నిశ్శబ్దాన్ని నింపింది. మనస్పర్థలో లేక మరే ఇతర కారణాలో తెలియదు కానీ, భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి బలవన్మరణానికి పాల్పడటంతో 13 నెలల పసిపాప అనాథగా మిగిలిన హృదయ విదారక ఘటన బాపట్ల జిల్లా రావూరిపేటలో తీవ్ర కలకలం రేపింది. సముదాయించాల్సిన తల్లిదండ్రులే శాశ్వతంగా కన్నుమూయడంతో, ఆ చిన్నారి గుక్కపట్టి ఏడుస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఒకరు బెడ్‌రూమ్‌లో, మరొకరు బాత్‌రూమ్‌లో విగతజీవులుగా పడి ఉన్న ఆ దృశ్యం.. క్షణికావేశం ఒక నిండు కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది.
ఏం జరిగిందంటే..?రావూరిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మాజేటి ప్రభాకర్(33), పార్వతి(24)లకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 13 నెలల కుమార్తె మాన్విత ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ప్రభాకర్ ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం పార్వతి తన పాపను పక్కింటి వారికి అప్పగించి లోపలికి వెళ్లింది. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ప్రభాకర్ సోదరుడు వచ్చి చూడగా, ఇల్లు లోపల గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా భయంకర దృశ్యం వెలుగుచూసింది. పార్వతి బెడ్‌రూమ్‌లో చీరతో ఉరివేసుకోగా, ప్రభాకర్ బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసుల దర్యాప్తు సమాచారం అందుకున్న చీరాల రూరల్ సీఐ సుధాకర్, వేటపాలెం ఎస్‌ఐ జనార్దన్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కంటతడి పెట్టిస్తున్న పసిపాప స్థితితల్లిదండ్రులు ఇద్దరూ విగతజీవులుగా పడి ఉండగా, ఏమీ తెలియని ఆ పసిపాప పాలబుగ్గలతో ఏడుస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. అమ్మా.. నాన్నా అని పిలుచుకునే వయసు కూడా రాకముందే, ఆ చిన్నారిని అనాథను చేసి వెళ్లడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. క్షణికావేశంలో భార్యా, భర్తలు తీసుకున్న నిర్ణయం ఆ పసిపాపను అనాధను చేసింది.

