ఓ ఎస్ఐ మీద కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రక్షక భట నిలయాలు బాధితులకు భరోసా ఇచ్చే కేంద్రాలుగా ఉండాలి కానీ, వేధింపులకు వేదికలు కాకూడదని ఆయన స్పష్టం చేశారు.
బాధ్యత మరిచి ప్రవర్తించిన కర్నూలు ట్రాఫిక్ ఎస్సై హరిప్రసాద్‌ను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ డీఐజీ జారీ చేసిన ఉత్తర్వులు కేవలం ఒక అధికారిపై తీసుకున్న చర్య మాత్రమే కాదు.. పరిధి దాటి ప్రవర్తించే ప్రతి ఖాకీకి ఇదొక గట్టి హెచ్చరిక. ఈ నేపథ్యంలో, ఆ ఎస్ఐ తొలగింపు పోలీసు వ్యవస్థలో ఒక నిజమైన గుణపాఠం అవుతుందా? ఖాకీల అతికి ఈ నిర్ణయం శాశ్వతంగా కళ్లెం వేయగలదా? అనే అంశాలు చర్చనీయాంశాలుగా మారాయి.
అధికారం అండతో అరాచకమా?2012 బ్యాచ్‌కు చెందిన హరిప్రసాద్ ప్రస్థానం ఆది నుంచి వివాదాలతోనే ముడిపడి ఉంది. ఆళ్లగడ్డ రూరల్ ఎస్సైగా ఉన్నప్పుడు ఒక సామాన్య ట్రాక్టర్ డ్రైవర్‌ను ఆయన ఏ స్థాయిలో వేధించారంటే.. సదరు బాధితుడు ఆత్మహత్యాయత్నం చేసి తన గోడును మంత్రి లోకేశ్‌కు సెల్ఫీ వీడియో ద్వారా పంపాల్సి వచ్చింది. అప్పట్లో సస్పెన్షన్‌తో సరిపెట్టుకున్నా, విధుల్లోకి వచ్చాక ఆయన తీరు మారకపోవడం గమనార్హం. అధికారం చేతిలో ఉంది కదా అని సామాన్యులను వేధిస్తే, అది చివరకు కెరీర్‌కే ఎసరు పెడుతుందని ఈ ఉదంతం నిరూపిస్తోంది.వ్యక్తిగత వికృత చేష్టలు.. ఖాకీ ప్రతిష్టకు మచ్చపోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ అనేది అత్యంత ముఖ్యం. కానీ, హరిప్రసాద్ ఒక యువతిని మాయమాటలతో ట్రాప్ చేయడం, మూడేళ్ల పాటు సన్నిహితంగా ఉండి, ఆమె వివాహం నిశ్చయమైన వేళ వికృత చేష్టలకు దిగడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. వ్యక్తిగత ఫోటోలను ఆమెకు కాబోయే భర్తకు పంపి పెళ్లి చెడగొట్టడం అనేది ఒక పోలీసు అధికారి చేయాల్సిన పనేనా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇలాంటి 'బ్లాక్ మెయిలింగ్' రాజకీయాలు చేసేవారు రక్షక భట నిలయాల్లో ఉంటే ప్రజలకు పోలీసులపై నమ్మకం ఎలా కలుగుతుందనేది ఆ శాఖలోని కొందరి ఉన్నతాధికారుల అంతర్మథనం.ఉద్యోగం నుంచి తొలగింపు.. ఒక బలమైన సంకేతంసాధారణంగా ఏవైనా తప్పులు జరిగినప్పుడు సస్పెన్షన్ లేదా బదిలీలతో సరిపెట్టడం చూస్తుంటాం. కానీ, హరిప్రసాద్ విషయంలో ఏకంగా డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ (Dismiss from service) ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ఉన్నతాధికారులు ఒక బలమైన సంకేతాన్ని పంపారు. ఎన్నిసార్లు శిక్షించినా ప్రవర్తన మారని అధికారులకు పోలీసు శాఖలో స్థానం లేదని తేల్చి చెప్పారు. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన నష్టం కాదు.. వ్యవస్థను ప్రక్షాళన చేసే ప్రక్రియలో భాగంగా తీసుకున్న సాహసోపేత నిర్ణయం.
మిగిలిన అధికారులకు ఇదో గుణపాఠం
పోలీసు యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి సమాజంలో అత్యంత గౌరవప్రదంగా ఉండాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చుకున్నా, మహిళల జీవితాలతో ఆడుకున్నా వేటు తప్పదని ఈ ఘటన హెచ్చరిస్తోంది. తాజా నిర్ణయంతోనైనా క్షేత్రస్థాయిలో ఉన్న ఎస్సైలు, ఇతర అధికారులు తమ బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తిస్తారని, అలా కాకుండా , విధులకు వ్యతిరేకంగా చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే.. ఆ చట్టమే వారిని విధులకు దూరం చేస్తుందనేది ఈ హరిప్రసాద్ ఎపిసోడ్ నేర్పిన అసలైన పాఠం.

